ఫ సన్నాలకు బోనస్ ఇస్తామని ప్రచారం చేసినా ఆసక్తి చూపని రైతులు
ఫ తెగుళ్ల బెడద, నూక శాతం, నీటి సమస్యల భయంతో సాగుకు వెనకడుగు
ఫ దొడ్డు రకం వరి సాగుకే తొలి ప్రాధాన్యం
నాకు ఐదు ఎకరాలు ఉంది. మరో తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం 14 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాను. కుటుంబ అవసరాల కోసం ఎకరంలో మాత్రమే సన్న రకం(బీపీటీ ) వేశాను. మిగతా 13 ఎకరాల్లో దొడ్డు రకమే సాగు చేస్తున్నాను. దొడ్డు వరికి పెట్టుబడి తక్కువ దిగుబడి బాగుంటుంది. దీనికి తెగుళ్లు రావు. విక్రయించడానికి ఇబ్బందులు ఉండవు. సన్నాలు వేస్తే నీటి సమస్య, నూక శాతం, మార్కెటింగ్ తిప్పలు ఎక్కువ. – జక్కిడి వెంకట్‌రెడ్డి, రైతు, సంస్థాన్ నారాయణపురం
సంస్థాన్ నారాయణపురం: సన్న రకం వరి సాగు పెంచాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు కొంత మేర ఫలిస్తున్నా రైతులు మాత్రం దొడ్డు రకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మద్దతు ధరకు తోడు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, రైతు వేదికల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం వల్ల గత యా సంగితో పోలిస్తే ఈసారి సన్నాల సాగు పెరిగింది. కానీ మొత్తం వరి సాగులో అధిక శాతం దొడ్డు రకా లకే కేటాయిస్తున్నారు. సాగు ఖర్చు నుంచి మా ర్కెటింగ్ వరకు లాభనష్టాలు బేరీజు వేసుకున్న రైతులు చివరకు దొడ్డు రకాల వైపే మొగ్గు చూపుతున్నారు.
వరిసాగు అంచనా 3.05 లక్షల ఎకరాలు
జిల్లాలో ఈ వానాకాలంలో సుమారు 3.05 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో సన్న, దొడ్డు రకాల సాగు విస్తీర్ణంపై గ్రామాల వారీగా అంచనాలు సిద్ధం చేస్తున్నారు.
ప్రచారం చేసినా..
వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి సన్నాల సాగు ప్రయోజనాలను వివరించారు. క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించడం కూడా వారిలో ఆసక్తి పెంచింది. ఫలితంగా గత యాసంగితో పోలిస్తే ఈసారి వానాకాలంలో సన్న రకాల సాగు విస్తీర్ణం పెరిగింది. కానీ మెజార్టీ రైతులు దొడ్డు రకాలే సాగు చేసేందుకు నార్లు పోస్తున్నారు.
దొడ్డు రకాల సాగుకే మొగ్గు ఎందుకంటే..
దొడ్డు రకాల్లో సాగు ఖర్చు తక్కువ. ఎరువులు, మందుల వినియోగం కూడా కొంతమేర నియంత్రణలో ఉంటుంది. పంట కాలం, వాతావరణ మార్పుల ప్రభావం తక్కువ. నీటి కొరత వచ్చినా తట్టుకుంటుంది. దొడ్డు ధాన్యం ఎకరాకు 25 నుంచి 28 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని, పెద్దగా తెగుళ్లు రావని రైతుల నమ్మకం. దిగుబడి ఎక్కువ రావడంతో పాటు కోత పూర్తయిన వెంటనే మిల్లులకు విక్రయించే అవకాశం ఉంటుంది. దీంతో పెట్టిన పెట్టుబడి త్వరగా చేతికి వస్తుందని రైతులు చెబుతున్నారు.
సన్నాలకు అడ్డంకులే ఎక్కువని..
సన్న రకాల సాగులో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సన్నాలు సాగు చేస్తే తెగుళ్లు, పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందని, దిగుబడి కూడా ఎకరాకు 20 క్వింటాళ్లకు మించి రాదనే అభిప్రాయంతో రైతులు ముందుకు రావడం లేదు. పంట కాలం ఎక్కువ ఉండటంతో చివరి దశలో నీటి అవసరం అధికంగా ఉంటుంది. నీటి కొరత ఏర్పడితే నూక శాతం పెరిగి దిగుబడిపై ప్రభావం పడుతుంది. చీడపీడల బెడద, గింజలపై మచ్చలు, తేమ సమస్యల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధాన్యం నాణ్యతలో చిన్న లోపం ఉన్నా ధర తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు.


