భువనగిరి: ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి నూతన విధానాన్ని అమలు చేయనుంది. రేషన్ సరకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా ఏటీఎం కార్డు తరహాలో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులను అందించనుంది. కొత్త కార్డులు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. త్వరలోనే వాటిని ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు పంపిణీ చేయనున్నారు.
స్కాన్ చేస్తే వివరాలు ప్రత్యక్షం
స్మార్ట్ కార్డు పై యజమానిపేరుతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు ఉండనున్నాయి. లబ్ధిదారు రేషన్ దుకాణానికి వెళ్లి డీలర్‌కు కార్డు అందిస్తే తన వద్ద ఉన్న ఈ పాస్ యంత్రంతో స్కాన్ చేస్తారు. అందులో లబ్ధిదారుల వివరాలతో పాటు ఇప్పటి వరకు తీసుకున్న, తీసుకోవల్సిన రేషన్ సరకుల వివరాలు కనిపిస్తాయి. కార్డు చిరిగిపోకుండా తడిసినా ఇబ్బంది లేకుండా ఉండేలా రూపొందించారు.
చిన్న సైజులో..
కొత్తగా అందించే రేషన్ కార్డు ఏటీఎం కార్డు సైజులో ఉండనుంది. ఇప్పటి వరకు సరైన కార్డులు లేకపోవడంతో మీ సేవ ద్వారా అప్‌లోడ్ చేసుకున్న పత్రాలను తీసుకుని రేషన్ దుకాణానికి వెళ్లి అందులోఉన్న నంబర్ తీసుకుని సరకులను అందిస్తూవస్తున్నారు. అయితే పేపర్ చిరిగిపోవడం నంబర్ గుర్తుండకపోవడం వంటి సమస్యలతో వృద్ధులు, నిరక్షరాస్యులు ఇబ్బందులు పడేవారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు రారష్ట్‌ర ప్రభుత్వం చిన్న సైజులో క్యూ ఆర్ కోడ్‌తో ఉన్న కార్డును త్వరలోనే అందించనుంది. కాగా జిల్లాలో 515 రేషన్ దుకాణాలు ఉండగా 2,52,187 కార్డులున్నాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు
కొత్త కార్డుల పంపిణీ : డీఎస్‌ఓ
ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల అధికారిణి రోజా తెలిపారు. ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం అందించనున్నట్లు పేర్కొన్నారు.
రేషన్ లబ్ధిదారుల వివరాలు
రేషన్ దుకాణాలు 515
కార్డులు 2,52,187
యూనిట్లు 7,95,239
ఫ జిల్లాకు చేరుకున్న కొత్త కార్డులు
ఫ ఏటీఎం కార్డు సైజులో రూపకల్పన
ఫ త్వరలో పంపిణీకి సన్నాహాలు


