భువనగిరిటౌన్ : స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లకు జెడ్పీ అకౌంట్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జెడ్పీ ఖాతాల నిర్వహణ, నిధుల వినియోగం, ఆడిట్ సూత్రాలు, నిబంధనలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉప కార్యనిర్వహణాధికారి చిలుకూరి శ్రీనివాస్, పర్యవేక్షకులు జి. జ్ఞాన ప్రకాష్ రెడ్డి, డి. కృష్ణ, సీనియర్ అసిస్టెంట్ కె. రమేష్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణ ప్రజల బాధ్యత
యాదగిరిగుట్ట: మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఈఓ భవానీ శంకర్, ఎస్‌పీఎఫ్ కమాండెంట్ ఎన్.త్రినాథ్, యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా యాదగిరి దేవస్థానానికి చెందిన గోశాలలో బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు విరివిగా కురువాలంటే పచ్చని చెట్లు ఉండాలన్నారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్, యాదగిరి ఆలయ సీఎస్‌ఓ కే.శేషగిరి రావు పాల్గొన్నారు.
డిగ్రీ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.రామారావు తెలిపారు. కళాశాలలో కామర్స్, కంప్యూటర్ సైనన్స్ అండ్ అప్లికేషన్, గణితశాస్త్రం, తెలుగు విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టు ఒకటి చొప్పున మొత్తం నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత పీజీ సబ్జెక్టులో ఓసీ, బీసీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించి ఉండాలని సూచించారు. ఈ నెల 27న హుజూర్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కార్యాలయంలో నేరుగా దరఖాస్తులను సమర్పించాలని కోరారు.


