
కనులపండువగా నిత్యకల్యాణం
యాదగిరిగుట్ట: పంచనారసింహుడు కొలువైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సంప్రదాయ పూజల్లో భాగంగా స్వామి, అమ్మవారి నిత్యకల్యాణం కనువ పండువగా నిర్వహించారు. వేకువజామునే స్వామి వారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ, అనంతరం ఆరాధన, గర్భాలయంలోని స్వయంభూలను అభిషేకం, సహస్రనామర్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంపై గల ఉత్తరదిశ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఆ తరువాత గజవాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణ వేడుక, వెండి జోడు సేవోత్సవం వేదమంత్రోచ్ఛరణల మధ్య జరిపించారు. ఇక ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు.
వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
వలిగొండ : సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. వలిగొండ మండలంలోని వెల్వర్తి ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం వైద్యసిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో విధులకు హాజరుకావాలని సూచించారు.
గవర్నర్‌ను కలిసిన ఎంజీయూ వీసీ
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ బుధవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. యూనివర్సిటీలోని పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విద్యాభివృద్ధి, కోర్సులు తదిరత అంశాలను గవర్నర్‌కు వివరించారు. సెప్టెంబర్ నెలలో యూనివర్సిటీలో నిర్వహించనున్న కాన్వకేషన్‌కు గవర్నర్‌ను ఆహ్వానించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ అలువాల రవి, సీఓఈ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి ఉన్నారు.
సంక్షోభంలో విద్యారంగం
భువనగిరి: రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంతో ఉందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు. భువనగిరిలోని సాయికృత డిగ్రీ కళాశాలలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగుతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ. 8వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు చదువులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎప్‌ఎస్‌ఐ రాజీలేని పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కల్లూరి మల్లేశం, జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, ఉపాధ్యక్షుడు ఈర్ల రాహుల్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు నేహల్, ఉదయ్, జగన్, కార్తీక్, భవానీ, శంకర్, గాయత్రి, రాణి, ప్రకాష్, నరేందర్, మహేష్, సతీష్ పాల్గొన్నారు.