
కీలక పోస్టులన్నీ ఖాళీ!
ఆలేరు: మున్సిపాలిటీని సిబ్బంది కొరత వేధిస్తోంది.కీలకపోస్టులు ఖాళీగా ఉండడంతో సమస్యలు పేరుకుపోతున్నాయి.ఉన్న కొద్దిమందికి సైతం మరో చోట కూడా బాధ్యతలు అప్పగిస్తుండటంతో ఎక్కడా పూర్తిస్థాయిలో దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. దీంతో నెలల తరబడి పనులు పెండింగ్‌లో ఉండడంతో పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు.అభివృద్ధి పనులు సైతం ఆశించిన మేర సాగడం లేదని వాపోతున్నారు.
వివిధ విభాగాల్లో ఖాళీలు ఇలా..
● శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉండటంతో జూనియర్ అసిస్టెంట్‌కు బాధ్యతలు అప్పగించారు. దాంతో చెత్త తొలగింపు, సేకరణ, డ్రెయినేజీలను శుభ్రం చేయడం తదితద పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ సక్రమంగా జరగటం లేదనే వాదనలు ఉన్నాయి.
● టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్(టీపీఓ) పోస్టు ఏళ్లుగా భర్తీ చేయడం లేదు. కొత్త ఇళ్ల నిర్మాణాలకు పర్మిషన్, అనుమతుల మేరకు నిర్మాణాలు జరుగుతున్నాయా లేదా? పరిశీలించే రెగ్యులర్ టీపీఓ లేరు. నర్సంపేట, జనగాం మున్సిపాలిటీలకు టీపీఓగా కొనసాగుతున్న వీరస్వామి ఆలేరుకూ ఇంచార్జ్‌గా ఉన్నారు. ఆయన వారంలో రెండు రోజులు వచ్చిపోతుంటారు. అక్రమ నిర్మాణాలతో మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతున్నా అడిగే వారు లేరు.
● అసిస్టెంట్ ఇంజనీర్ లేక వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు మోక్షం కలగడం లేదు. రూ.15 కోట్ల నిధులున్నా అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూరు మున్సిపాలిటీలకు ఏఈగా ఉన్న సురేష్ ఆలేరుకు ఇంచార్జ్‌గా ఉన్నారు.
● హెల్త్ అసిస్టెంట్ లేకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్‌లు, టిఫిన్ సెంటర్లలో నాణ్యతా ప్రమాణాలు, ఆహార పదార్థాల శుచి, శుభ్రత పరిశీలన గాలికి వదిలేశారనే విమర్శలు ఉన్నాయి. వ్యాధులు వ్యాప్తి చెందకుండా సూచనలు,జాగ్రత్తలు ఇచ్చే వారు కరవయ్యారు.
● పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన ఎన్వి రాన్‌మెంట్ ఇంజనీర్ పోస్టు ఖాళీగా ఉంది.
ఆలేరు మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత
ఉన్న కొద్ది మందికి వేరే చోట బాధ్యతలు
నిలిచిపోతున్న పనులు,
ఇబందిపడుతున్న ప్రజలు
ఉన్నతాధికారులకు నివేదించాం
మున్సిపాలిటీలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు, డిప్యూటేషన్ల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. ఉన్న సిబ్బందికి అదనపు బాధ్యతలు కేటాయించి పనులు చేస్తున్నాం. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమిస్తే అభివృద్ధి పనులను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.
– శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, ఆలేరు