
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
సాక్షి,యాదాద్రి : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి ఆదేశించారు. బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి మండలాల పరిధిలోని రుద్రవెల్లి–జూలూరు మధ్య మూసీని ఆదివారం ఆయన పరిశీలించారు. పలు ప్రాంతాల్లో మూసీ, వాగులు, వంకలు వంతెనలపై నుంచి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తగా బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేసినట్లు చెప్పారు. రెవెన్యూ సిబ్బంది, పోలీసులను కాపలా ఉంచినట్లు వెల్లడించారు. రుద్రవెల్లి –జూలూరు వద్ద బ్రిడ్జి పైనుంచి వరద ఉధృతంగా పారుతుందని, ఎగువనుంచి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు గుర్రపుడెక్క కొట్టుకువచ్చి తూముల వద్ద పేరుకుపోయిందన్నారు. నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారడంతో పంచాయతీ సిబ్బందితో తొలగించినట్లు చెప్పారు. శిథిల భవనాలు, మట్టి మిద్దెలు, గోడలు వర్షాలకు నాని కూలిపోయే అవకాశం ఉందని, వాటిని గుర్తించి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఫ భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి