
నేడు జయశంకర్ జయంతి
భువనగిరి టౌన్: కొత్తపల్లి జయశంకర్ జయంతిని బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్ అధికారి సాహితీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశ మందిరంలో ఉదయం 11గంటలకు నిర్వహించనున్నామని అధికారులు పాల్గొనాలని కోరారు.
నేడు దూదివెంకటాపురంలో కలెక్టర్ పల్లె నిద్ర
రాజాపేట : గ్రామాల్లోని సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు పల్లెల్లో రాత్రి బస చేయడం జరుగుతుందని కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం రాజాపేట మండలంలోని దూది వెంకటాపురం గ్రామం నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం అధికారులతో కలిసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటామని తెలిపారు.
ఒకేరోజు 2.50 లక్షల మొక్కలు నాటుదాం
భువనగిరి టౌన్ : వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం ఒకే రోజు జిల్లాలో 2.50 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో మొత్తం 20 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ణయించగా.. ఇప్పటివరకు 14 లక్షల మొక్కలు నాటడం పూర్తయ్యిందని పేర్కొన్నారు. గురువారం ప్రతి గ్రామంలో 500 మొక్కలు, మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో 300 మొక్కల చొప్పున మొత్తంగా 2.50 లక్షల మొక్కలు నాటడం పూర్తి చేయాలని తెలిపారు. ఈమేరకు అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు.
దివ్యాంగుల
పూరిగుడిసె పరిశీలన
గుండాల : మండలంలోని మాసాన్‌పల్లి గ్రామంలో దివ్యాంగులైన బొంత ఎల్లయ్య, లక్ష్మి దంపతులు పూరి గుడిసెలో నివాసం ఉంటుండగా. వారి ధీనస్థితిపై సాక్షి దినపత్రికలో మంగళవారం ‘నీడ లేదు...గూడు ఇప్పించరూ’ అనే శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన ఎంపీడీఓ దేవేందర్‌రావు బుధవారం గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరిశీలించారు. నివేదికను కలెక్టర్‌కు పంపిస్తామని తెలిపారు. ఆయన వెంట గ్రామ కార్యదర్శి మంద బాలలక్ష్మి ఉన్నారు.
ప్రజా కళలు
పోరాట ఆయుధాలు
రామన్నపేట: ప్రజా కళలు పోరాట ఆయుధాలు అని, అనేక ఉద్యమాలను కళాకారులే ముందుండి నడిపారని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు, జానపద వీధి నాటకోత్సవాల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. ఈనెల 20, 21 తేదీల్లో రామన్నపేటలో జరగనున్న జానపద వీధి నాటకోత్సవాల సన్నాహక సమావేశంలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. జానపద కళలను పరిరక్షణకు చర్యలు చేపట్టాలని, కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జానపద వృత్తికళాకారులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరారు. సమావేశంలో ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కూరెళ్ల నర్సింహాచారి, గంటెపాక శివకుమార్, ఈర్లపల్లి ముత్యాలు, కందుల హన్మంతు, జెల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, కల్లూరి అంజయ్య, వనం ఉపేందర్, బోయిని ఆనంద్, కల్లూరి నగేష్, మేడి పృథ్వీ, గంటెపాక శ్రీకృష్ణ, నాగటి లక్ష్మణ్, మేడి ముకుందం తదితరులు పాల్గొన్నారు.

నేడు జయశంకర్ జయంతి