ఇద్దరు దొంగల రిమాండ్
భువనగిరి: ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సోమవారం భువనగిరి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను భువనగిరి డీఎస్పీ రవీందర్ విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన బోదాసు యాదగిరి, కొమిరె శ్రీను భువనగిరి పరసర ప్రాంతాల్లోని ఆలయాల్లో కొంతకాలంగా రాత్రివేళ దొంగతనాలకు పాల్పడుతున్నారు. సుమారు 5 ఆలయాల్లో చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి సోమవారం వారిద్దరిని పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి రూ.1.50లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితులిద్దరిపై సిద్దిపేట జిల్లాలో పలు చోరీ కేసులు ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. గతంలో వారు జైలుకు కూడా వెళ్లి వచ్చారని వివరించారు. విలేకరుల సమావేశంలో సీఐ చంద్రబాబు, ఎస్‌ఐ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.


