వీలైనన్ని చెట్లను సంరక్షిస్తాం
సమాచారం ఇస్తే సంరక్షిస్తాం
ఇటీవల భారీ వర్షాలకు తణుకు కేశవస్వామి ఆలయం వద్ద 150 ఏళ్లకు పైనే వయసున్న రావిచెట్టు కూలిపోయింది. చరిత్ర కలిగిన ఈ భారీ వృక్షాన్ని సంరక్షించుకోవాలనే ఆలోచన చేశారు మున్సిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్. పట్టణంలోని నెస్ట్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులతో చర్చించారు. చెట్టు కొమ్మలు తొలగించి మాను భాగాన్ని జాగ్రత్తగా వేళ్లతో పట్టణంలోని ఎన్‌టీఆర్ పార్కుకు తరలించారు. వేళ్లకు రూటెక్స్, కాఫర్ సల్ఫేట్, ఇతర ఫెర్టిలైజర్స్‌తో విజయవంతంగా రీ ప్లాంటేషన్ చేయించారు. సజ్జాపురంలో ఎన్నో ఏళ్ల వయసున్న గానుగ చెట్టును కూడా ఇలా బొమ్మల పార్కులో రీలొకేట్ చేశారు. పట్టణంలో నేలకొరిగిన మరిన్ని చెట్లకు జీవం పోసి విపత్తుతో నష్టపోయిన పచ్చదనాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు.
సాక్షి, భీమవరం/తణుకు అర్బన్: అర్నబ్ తుపానుకు జిల్లాలో నరసాపురం, భీమవరం, పాలకొల్లు, తణుకు తదితర నియోజకవర్గాల్లో ఆరు వేలకు పైనే చెట్లు పడిపోయాయి. రాకపోకలకు వీలుగా రోడ్లకు అడ్డంగా పడిపోయిన వాటిని యుద్ధప్రాతిపదికన తొలగించారు. చాలాచోట్ల కాలువ గట్లు, ఖాళీ ప్రదేశాల్లో నేలకొరిగిన చెట్లు ఇంకా దాదాపు అలానే ఉన్నాయి. వీటిలో ఏళ్లనాటి చెట్లు ఎన్నో. ఒక పెద్ద వృక్షం పెరగడానికి దశాబ్దాల సమయం పడుతుంది. అలాంటి చెట్టును తొలగించడం కంటే, బతికేందుకు అవకాశం ఉన్న వాటిని గుర్తించి పరిరక్షిస్తే పక్షులకు ఆవాసం, ప్రజలకు నీడ, పర్యావరణానికి మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. స్థానిక సంస్థలు, ఉద్యానశాఖ ఆ దిశగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు.
వినూత్న ఒరవడి
చెట్లు పడిపోయినప్పుడు వాటిని తొలగించడానికి భిన్నంగా తణుకులో నేలకొరిగిన చెట్లను మరోచోట నాటి మళ్లీ ప్రాణం పోసే ప్రయత్నం అందరిని ఆకట్టుకుంటోంది. కోవిడ్ సమయంలో తూర్పుగోదావరి జిల్లా మండపేట మున్సిపల్ కమిషనర్‌గా రామ్‌కుమార్ పనిచేశారు. ‘టీం సురక్ష’ పేరిట స్థానిక యువతతో వైద్యశిబిరాల నిర్వహణ, బాధితులకు సేవా కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నారు. అదే తరహాలో నెస్ట్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు, ప్రజలతో కలిసి నేలకొరిగిన చెట్లకు జీవం పోసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కమిషనర్ సహకారంతో ఇప్పటికే రెండు భారీ వృక్షాలను రీలొకేట్ చేయగా మరో 25కు పైగా వృక్షాలను రీలొకేట్‌కు చర్యలు తీసుకుంటున్నట్టు నెస్ట్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు బి.భార్గవి, ఎం.దుర్గాసాయి, కె.లీలాకృష్ణ తెలిపారు. చెట్టు పడిపోతే నరికేయడం ఒక్కటే మార్గం కాదని, వాటిని సంరక్షించే దారి చూడాలంటున్నారు. ఇటీవల పడిపోయిన చెట్లను గమనించినప్పుడు చుట్టూ కాంక్రీట్ నిర్మాణాలు ఉన్నచోట వేర్లు బలహీనంగా ఉన్నట్టు తెలిపారు. సిమెంట్ దిమ్మలు, కాంక్రీట్ నిర్మాణాలు చేసేటప్పుడు చెట్లకు మూడు అడుగుల దూరం ఉండేట్టు చూడాలని సూచిస్తున్నారు. జిల్లాలో ఎక్కడైనా పడిపోయిన వృక్షాల రీలొకేట్‌కు తమ స్వచ్ఛంద సంస్థ సహకారం అందిస్తుందని తెలిపారు.
వృక్షో రక్షతి రక్షితః
నేలకొరిగిన వృక్షాలను తిరిగి నిలబెడుతూ..
చెట్లకు ఊపిరి పోసే పనిలో నెస్ట్ కన్జర్వేషన్ సొసైటీ
కమిషనర్ చొరవ.. తణుకులో వినూత్న ఒరవడి
అర్నబ్‌తో జిల్లాలో నేలకొరిగిన ఆరు వేల చెట్లు
చెట్టు నేలకొరిగినంత మాత్రాన వాటి జీవితం ముగిసినట్టు కాదు. తగిన జాగ్రత్తలతో అనువైన చోట నాటి సంరక్షిస్తే మరలా జీవం పోసుకుని చిగురుస్తాయి. అర్నబ్ తుపాను ప్రభావంతో తణుకులో చాలాచోట్ల చెట్లు పడిపోయాయి. వాటిలో వీలైనన్ని చెట్లను సంరక్షించాలనే ప్రయత్నం చేస్తున్నాం.
– టి.రామ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్, తణుకు
పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మా సంస్థ పనిచేస్తుంది. తణుకు మున్సిపాల్టీ సహకారంతో పట్టణంలో పడిపోయిన చెట్లను కాపాడుకునే కార్యక్రమం చేస్తున్నాం. జిల్లాలో ఎక్కడైనా ఈ విధంగా రీ ప్లాంటేషన్ చేయాలనుకువారు మమ్మల్ని సంప్రదిస్తే మా సంస్థ అవసరమైన సహకారం అందిస్తుంది.
– ఎం.మణికంఠ (మనీష్), నెస్ట్ కన్జర్వేషన్ సొసైటీ ఫౌండర్, ప్రెసిడెంట్, తణుకు


