రైతు కష్టం నీటిపాలు | - | Sakshi
Sakshi News home page

రైతు కష్టం నీటిపాలు

Nov 12 2026 5:18 AM | Updated on Nov 12 2026 5:18 AM

రూ.1.20 లక్షల నష్టం

● నిండా ముంచిన వరుస తుపాన్లు

● నేటికీ నీటిలోనే వరి చేలు

● పొంచి ఉన్న మరో తుపాను

తాడేపల్లిగూడెం రూరల్‌: వరుస తుపాన్లు తాడేపల్లిగూడెం మండలంలో ఊరూ చేలను ముంచేశాయి. ఎర్రకాలువ పరీవాహక ప్రాంతాల్లోని చేలన్నీ రోజుల తరబడి నీటిలోనే మునిగి చివికిపోతు న్నాయి. పలువురు రైతులు మరింత పెట్టుబడులు పెట్టలేక నీటిలోనే పంటను వదిలేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో నందమూరు, ఆరుళ్ల, మారంపల్లి, జగన్నాథపురం గ్రామాల్లోని వరి చేలు నీటిలోనే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి నీటిలోనే తడిసి ఉండటంతో పంట పాడైన పరిస్థితి. వీ టితో పాటు కూరగాయలు, ఉద్యాన పంటలు నీట మునిగాయి. కూరగాయల పంటలైతే పూర్తిగా పాడయ్యాయని రైతులు వాపోతున్నారు. దాదాపు 20 వేల నుంచి 22 వేల ఎకరాల్లో వరి పంట పాడైనట్లు ప్రాథమిక అంచనా.

విత్తనాల కోసం పడిగాపులు

అర్నాబ్‌, మురసు తుపాన్ల బారిన పడినా రైతులు ఆశ వదులుకోక నీట మునిగిన వరి పంటను దుక్కిలో దున్ని తిరిగి సాగు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రైతు వారీగా కూడా విత్తనాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

మరో తుపాను హెచ్చరిక

ఇప్పటికే నిండా మునిగిన రైతులను ఈనెల 13 నుంచి అక్నవ్‌ తుపాను హెచ్చరికలు మరింత కలవరపరుస్తున్నాయి. ఇప్పటికే తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం జలదిగ్బంధంలో మునిగింది. మరో తుపాను వస్తే ఎలా ఉంటుందోనని రైతులు, ప్రజ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నందమూరులో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. అర్నబ్‌, మురసు తుపాన్లతో చేతికొచ్చిన పంట నీటి పాలైంది. అంతే కాకుండా ఇందుకోసం పెట్టిన పెట్టుబడులు రూ.1.20 లక్షలు తిరిగి రాని పరిస్థితి. సాగుకు అలవాటు పడిన ప్రాణం కావడంతో తిరిగి సాగు చేసేందుకు సిద్ధమవుతున్నాం. విత్తనాలు, పెట్టుబడులు కోసం పడిగాపులు పడుతున్నాం.

– గెడ్డం చినవెంకట్రావు, కౌలు రైతు, నందమూరు, తాడేపల్లిగూడెం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement