పెనుమంట్ర: పెనుగొండ మండలం ములపర్రు పంచాయతీ పరిధిలోని పితానివారిపాలెంలో శెట్టిబలిజ కులానికి చెందిన వైఎస్సార్‌సీపీ వర్గీయులమైన తమను కుల బహిష్కరణ చేసినట్టు గ్రామంలో మైకుల ద్వారా ప్రచారం చేయడంతో పాటు తమపై యాసిడ్, కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ.. వారి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బుధవారం బాధితులు పితాని తాతయ్య, పితాని వీర వెంకట సత్యనారాయణ, పితాని సుబ్రమణ్యం అనే వ్యక్తులు పెనుగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఫిర్యాదు కాపీలను ఆచంట మండలం తూర్పుపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులకు అందజేశారు. తమ ఆడపడుచులను, తోబుట్టువులను కూడా ఇళ్లకు రాకుండా నిర్బంధించడమే కాకుండా కాఫీ హోటల్స్, కిరాణా, కూరగాయల దుకాణాల వద్ద తమకు సరుకులు ఇవ్వొద్దని ఆంక్షలు విధిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను కుల బహిష్కరణ చేసినట్టు ప్రకటించిన 15 మంది వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారి పేర్లను కూడా ఆ ఫిర్యాదులో వివరించారు.
బాధితులకు శ్రీరంగనాథరాజు అండ
కుల బహిష్కరణ బాధితులైన 10 కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి చె రుకువాడ శ్రీ రంగనాథరాజు అండగా నిలిచారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన బాధితులను ఓ దార్చి అండగా నిలవడంతో పాటు గురువారం ఆ గ్రామానికి వెళ్లి గ్రామ పెద్దలతో మాట్లాడతానని చెప్పారు. అలాగే బాధితులకు రక్షణ కల్పించాలని పెనుగొండ పోలీసులను కోరారు.


