సందర్శనీయ ప్రదేశాలు
పర్యాటక హబ్‌గా పోలవరం
ఇసుక తిన్నెలపై ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన కాటేజీలు
బుట్టాయగూడెం : కార్తీకమాసంలో ప్రజలు ఆధ్యాత్మికతోపాటు పర్యాటకానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపుతారు. పిక్‌నిక్‌ల పేరుతో వివిధ ప్రాంతాలకు వెళ్లాడానికి సన్నద్ధమవుతారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలపై ఒక లుక్కేద్దాం.
పశ్చిమ ఏజెన్సీ అటవీ అందాలు
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని అడవి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. జాలువారుతున్న జలపాతాలు, కొండలను తాకుతున్న మేఘాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు మనసును దోచుకుంటున్నాయి. జల్లేరు జలాశయం, ముంజులూరులోని ఏనుగుతోగు జలపాతం, గుబ్బల మంగమ్మ సన్నిధి, పోగొండ రిజర్వాయర్‌తో పాటు అటవీ ప్రాంతంలోని పలు ప్రదేశాలు అద్భుతమైన పిక్‌నిక్ స్పాట్‌లుగా ఉన్నాయి.
ఆహ్లాదకరం.. గోదావరి విహారం
కార్తీకమాసంలో పాపికొండల విహారానికి పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి యాత్రికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇటీవల తుపాను కారణంగా కురిసిన వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో బోటు ప్రయాణాలను పర్యాటక శాఖ నిలిపివేసింది. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో అధికారులు తిరిగి బోటు ప్రయాణాలకు అనుమతిచ్చారు. దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఘాట్ నుంచి పాపికొండలకు 12 బోట్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
గుబ్బల మంగమ్మ తల్లి గుడి
చుట్టూ పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, గలగల పారే సెలయేళ్ల సవ్వట్ల నడుమ గుహలో కొలువైన గుబ్బల మంగమ్మ తల్లి దర్శనం భక్తులను మైమరిపిస్తుంది. బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలోని అందమైన అడవిలో వెలసిన ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
గోదావరి నదిపై ప్రయాణిస్తున్న బోటు
పట్టిసీమ శివ క్షేత్రం
పాపికొండల విహారయాత్రలో పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఇసుక తిన్నెలపై కొలువైన పోలవరం మండలం పట్టిసీమ వీరభద్రస్వామి, మహానందీశ్వర స్వామి ఆలయాలు, దేవీపట్నం మండలంలోని గండి పోచమ్మ గుడి, బ్రిటిష్ కాలపు పోలీస్ స్టేషన్, 11వ శతాబ్దం నాటి ఉమాచోడేశ్వర స్వామి ఆలయం, కొరుటూరులో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కాటేజీలు, పేరంటాలపల్లి ఆశ్రమాన్ని దర్శించి అక్కడ శివుడిని పూజించవచ్చు.
ఆంధ్రుల జీవనాడిగా మారనున్న పోలవరం ప్రాజెక్టు ఒక చక్కని పర్యాటక కేంద్రంగా మారుతోంది. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి చేస్తే ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించవచ్చని ప్రకృతి ప్రేమికులు పేర్కొంటున్నారు.
కనువిందు చేయనున్న ఏజెన్సీ అందాలు
గోదావరి నదిపై ప్రారంభమైన బోటు ప్రయాణాలు
యాత్రికుల కోసం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సౌకర్యాలు


