స్వామీ.. నీ జాడ ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

స్వామీ.. నీ జాడ ఎక్కడ?

Nov 12 2026 12:31 AM | Updated on Nov 12 2026 12:31 AM

● పురోగతి లేని పంచలోహ విగ్రహం చోరీ కేసు

● విగ్రహం అపహరణకు గురై రెండేళ్లు దాటినా ఆచూకీ తెలియని వైనం

ఆగిరిపల్లి : రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వెయ్యి సంవత్సరాల పురాతన పంచలోహ విగ్రహం చోరీకి గురై రెండేళ్లు దాటినా, నేటికీ ఆచూకీ లభించకపోవడంతో భక్తులలో తీవ్ర కలవరం నెలకొంది. రెండేళ్ల క్రితం ఎగువ కొండపై ఉన్న స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలోకి చొరబడిన దుండగులు తలుపులు పగలగొట్టి, అత్యంత ప్రాచీనమైన పంచలోహ విగ్రహాన్ని అపహరించుకుపోయారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. నిందితులను పట్టుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకుంటామని పోలీసులు ప్రకటించినప్పటికీ, ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన పురోగతి లేకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్సైలు మారినా పురోగతి శూన్యం

సాక్షాత్తూ మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ప్రసిద్ధ క్షేత్రంలోనే ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. చోరీ జరిగిన తొలిరోజుల్లో హడావుడి చేసిన పోలీసులు, ఆ తర్వాత దర్యాప్తును వేగవంతం చేయకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటివరకు ఆగిరిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురు ఎస్సైలు మారినా కేసులో మాత్రం ఎలాంటి పురోగతి లేదని ఆరోపిస్తున్నారు.

ప్రధాన కార్యక్రమాలకు ఆటంకం

ఈ నెల 19 నుంచి ఆలయంలో కార్తీకమాస వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో, చోరీకి గురైన పంచలోహ విగ్రహాన్ని వెలికితీయాలని భక్తులు కోరుతున్నారు. విగ్రహం లేకపోవడంతో స్వామివారి ప్రధాన కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్సై సురేష్‌ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, విగ్రహ ఆచూకీ కనిపెట్టి తిరిగి ఆలయానికి చేర్చాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement