కఠోర నియమ నిష్టలు
ద్వారకాతిరుమల : పరమేశ్వరుడి కృపకు పాత్రులయ్యేందుకు భక్తులు ఎంచుకునే అత్యున్నత ఆధ్యాత్మిక మార్గమే శివదీక్ష. ఇహలోక బంధాలను వీడి, కఠోర నిష్టతో సాగే ఈ సాధన వల్ల సకల దోషాలు తొలగి, ముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పవిత్ర కార్తీకమాస పర్వదినాలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల క్షేత్రంలో పరమశివుడి నామస్మరణ మిన్నంటుతోంది. గత పదిహేనేళ్లుగా ఇక్కడ ఈ ఆధ్యాత్మిక సంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతోంది. ఏటేటా దీక్షాపరుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా, ఈ ఏడాది ఒక్క ద్వారకాతిరుమలలోనే 30 మందికి పైగా భక్తులు శివమాల ధరించారు.
మండల, అర్ధమండల దీక్షలు
భక్తుల వీలును బట్టి ఈ దీక్షలను 41 రోజులు (మండలం), 21 రోజులు (అర్ధమండలం), 11 రోజుల పాటు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే గత నెల 26న మండల దీక్ష ప్రారంభం కాగా, బుధవారం పలువురు భక్తులు అర్ధమండల దీక్షను స్వీకరించారు. మరికొందరు ఈ నెల 16న మాలధారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
శివమాల ధరించిన స్వాములు అత్యంత క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్నారు. రుద్రాక్షమాల, నుదుట విభూతి రేఖలు, కాషాయ/గోధుమ రంగు వస్త్రాలతో శివస్వరూపులుగా మారుతున్నారు. ద్వారకాతిరుమల శివస్వాములు ఏటా ఒక్కో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుని ఇరుముడులు సమర్పించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కార్తీకమాస ముగింపును పురస్కరించుకుని డిసెంబర్ 5న క్షేత్రపాలకుడైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో ఇరుముడులు కట్టుకోనున్నారు. అనంతరం మహారాష్ట్రలోని జ్యోతిర్లింగ క్షేత్రమైన భీమశంకర్‌కు తరలివెళ్లి, డిసెంబర్ 8 లేదా 9వ తేదీల్లో ఆ మహాదేవుడికి ఇరుముడులు సమర్పించనున్నారు.
క్షేత్రంలో అర్ధ మండల దీక్షలు ప్రారంభం
ద్వారకాతిరుమలలో పెరుగుతున్న దీక్షాపరుల సంఖ్య
డిసెంబర్ 5న ఇరుముడులతో భీమశంకర్ క్షేత్రానికి పయనం


