అధ్వానంగా డ్రెయినేజీ వ్యవస్థ
● అస్తవ్యస్తంగా డ్రెయినేజీ వ్యవస్థ
● ప్రచార ఆర్భాటాలకే పాలకులు పరిమితం
● ప్రధాన, అంతర్గత డ్రెయినేజీలలో పూడికను యుద్ధప్రాతిపదికన తొలగించాలి.
● మురుగునీరు సజావుగా వెళ్లేందుకు అవుట్‌లెట్లను మెరుగుపరచాలి.
● డ్రెయినేజీలపై పక్కా కల్వర్టులను నిర్మించి, శాశ్వత పద్ధతిలో వ్యవస్థను ఆధునీకరించాలి.
● ఏటా వర్షాకాలనికే ముందే పూడికతీత పనులను పకడ్బందీగా నిర్వహించాలి.
తాడేపల్లిగూడెం (టీఓసీ): ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతున్న పాలకులు పట్టణాభివృద్ధిని గాలికి వదిలేశారని స్థానికులు మండిపడుతున్నారు. గతంలో పురపాలక సంఘం పరిధిలో ఇరుకై న డ్రెయినేజీలలోనూ మ్యాన్యువల్‌గా, బాబ్‌కార్ట్‌ల ద్వారా సిల్ట్‌ను (పూడికను) వేగంగా తొలగించి మురుగునీటి పారుదల సక్రమంగా ఉండేలా చూసేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. అధికారులు, పాలకులు తూతూమంత్రంగా కొన్ని ప్రాంతాల్లోనే పూడికతీత పనులు చేపట్టారు. తొలగించిన సిల్ట్‌ను సరైన సమయానికి తరలించకపోవడంతో, కొద్దిపాటి వర్షానికే అది తిరిగి డ్రెయినేజీల్లోకి చేరింది. ఇటీవల అర్నబ్, మురసు తుపాన్ల కారణంగా కురిసిన భారీ వర్షాలకు డ్రెయినేజీలు సక్రమంగా ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలిచిపోయింది. పట్టణంలోని పాతూరు, హౌసింగ్‌బోర్డు, కడకట్ల, యాగర్లపల్లి, జువ్వలపాలెం తదితర శివారు ప్రాంతాలతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, తుపాను ప్రభావాన్ని అంచనా వేయడంలో యంత్రాంగం విఫలమవడమే దీనికి కారణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టణాభివృద్ధి శూన్యం
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా, గత పాలకులపై విమర్శలు చేయడమే తప్ప పట్టణాభివృద్ధి శూన్యమని విమర్శలు వస్తున్నాయి. ‘మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు’ అన్నచందంగా ప్రజాప్రతినిధుల తీరు ఉంది. కచ్చా డ్రెయినేజీలు, ఇరుకై న కాలువలు, లోపభూయిష్టమైన కల్వర్టుల నిర్మాణం, ఆక్రమణలు, సిబ్బంది కొరత వంటి సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. తూతుమంత్రంగా మాత్రమే పారిశుధ్య పనులు చేయడం, నీరు పారేందుకు వీలుగా అవుట్ లెట్స్ శుభ్రం చేయలేకపోవడం, నిర్లక్ష్యానికి గురైన మాస్టర్ ప్లాన్ ప్రాజెక్టులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. డ్రెయినేజీల ఆధునీకరణపై అధికారుల ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి.
తాడేపల్లిగూడెం పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. ఏటా వర్షాకాలం రాకముందే డ్రెయినేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ప్రధాన, అంతర్గత డ్రెయినేజీలలో సిల్ట్ ముందుగానే తీయాలి. డ్రెయినేజీ బ్లాక్స్‌ను ఎప్పుటికప్పుడు తొలగించాలి. మురుగు నీరు బయిటకు పంపే విధంగా చేయాలి.
– నౌషాద్ మొహిద్దీన్, వైఎస్సార్‌సీపీ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి


