భీమవరం: పట్టణంలోని కాస్మోపాలిటన్ క్లబ్‌లో నిర్వహిస్తున్న జాతీయస్థాయి టెన్నిస్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం జరిగిన పురుషుల విభాగం పోటీల్లో పి.ధర్మలింగం, అమిత్ మూంద్, డి.అఖిల్ కుమార్‌రెడ్డి, పి.శాండిల్య, జయప్రకాష్ విజేతలుగా నిలిచారు. మహిళల విభాగంలో హర్షిణి నాగరాజ్, జనని రమేష్, మృదుల పళనవేల్ గెలుపొందారు. ఈ వివరాలను క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ రామభద్రరాజు, బీహెచ్ సుబ్బరాజు, టోర్నమెంట్ చైర్మన్ యు.కృష్ణప్రసాద్, వైస్ చైర్మన్ టి.కృష్ణబాబు వెల్లడించారు.
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలపై
బీజేపీ ఆగ్రహం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు నగరపాలక సంస్థకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ తన వెన్నుపోటు నైజాన్ని చాటుకుందని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. విషయానికొస్తే... ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా కూటమి పొత్తుల్లో భాగంగా బీజేపీకి నాలుగు డివిజన్లు కేటాయించారు. అందులో స్థానిక 42వ డివిజన్ బీజేపీకి దక్కగా, అక్కడి నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకురాలు ఇల్లపకుర్తి కుసుమ కుమారి పోటీలో నిలిచారు. అయితే, ఆ స్థానం బీజేపీకి కేటాయించడాన్ని జీర్ణించుకోలేని స్థానిక టీడీపీ నాయకులు... తమ తరఫున ఒక మహిళను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దింపారని బీజేపీ నాయకులు మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. కూటమి ధర్మం ప్రకారం బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేయాల్సిన టీడీపీ, జనసేన నాయకులు, అక్కడ స్వతంత్ర అభ్యర్థి గెలుపు కోసం పని చేశారని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక టీడీపీ నాయకుడు తాము బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించుకున్నామని బహిరంగంగానే మీడియా ఎదుట ప్రకటించడాన్ని వారు తప్పుపట్టారు. టీడీపీ నాయకులు తమ వెన్నుపోటు నైజాన్ని మరోసారి ప్రదర్శించారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విషయాన్ని తేలికగా తీసుకోబోమని, ఇప్పటికే ఈ అంశాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు వారు తెలిపారు. కూటమి అగ్రనాయకుల సమావేశంలోనూ ఈ అంశాన్ని లేవనెత్తి, సదరు టీడీపీ నేతపై చర్యలు తీసుకునేలా పోరాడతామని స్పష్టం చేశారు. పొత్తు ధర్మానికి తూట్లు పొడిచిన సదరు టీడీపీ నాయకులపై ఆ పార్టీ అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకుని, పార్టీ నుంచి బహిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
టి.నరసాపురం: మండలంలోని అల్లంచర్ల యువకులు బుధవారం వైఎస్సార్‌సీపీ నాయకుడు బోళ్ళ రంగారావు ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. వారికి వైఎస్సార్‌సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, మాజీ జెడ్పీటీసీ సామంతపూడి సూరిబాబు, పార్టీ మండల నాయకుడు తుమ్మూరి శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కుప్పాల బాలాజీ, బండారి హరీష్, ఎల్లిబోయిన జగదీష్, అంకనబోయిన నాగబాబు, అంకనబోయిన కిషోర్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.


