చక్రపాణి మృతి తీరని లోటు | - | Sakshi
Sakshi News home page

చక్రపాణి మృతి తీరని లోటు

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

చక్రపాణి మృతి తీరని లోటు ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి చినవెంకన్న హుండీ ఆదాయం రూ. 2.52 కోట్లు నాలుగు మండలాల్లో పోలింగ్‌ వాయిదా

శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేను రాజు

భీమవరం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి మాజీ చైర్మన్‌ డాక్టర్‌ అప్పనబోయిన చక్రపాణి మృతిపై ఏపీ శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేనురాజు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం రాష్ట్రానికి, ముఖ్యంగా శాసన వ్యవస్థకు తీరని లోటని పేర్కొన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ శాసన మండలి ఔన్నత్యాన్ని కాపాడటంలో చక్రపాణి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చక్రపాణి 2007 నుంచి 2011 వరకు, తిరిగి 2011 నుంచి 2017 వరకు రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై సభను అత్యున్నత విలువలతో నడిపించారని గుర్తు చేశారు. గతంలో 1983 నుంచి 1985 వరకు మండలి డిప్యూటీ చైర్మన్‌గా, ప్రభుత్వ చీఫ్‌విప్‌గా కూడా సేవలందించారని తెలిపారు. కర్నూలు జిల్లా హుస్సేనాపురానికి చెందిన చక్రపాణి న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ సాధించిన విద్యావేత్త, మేధావి అని పేర్కొన్నారు. ఆంధ్ర జనతా దినపత్రిక సంపాదకుడిగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు రాజ్యాంగం, శాసన వ్యవస్థలకు సంబంధించి పలు విలువైన పుస్తకాలను రచించారని గుర్తు చేశారు. శాసన మండలి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడటంలో చక్రపాణి చూపిన మార్గం భవిష్యత్‌ తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని మోషేను రాజు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ఆసుపత్రికి వచ్చే రోగులను ఎంత శ్రద్ధగా చూసుకుంటామో, ఆస్పత్రి పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలని భీమవరం డీఎంఅండ్‌హెచ్‌ఓ రవిబాబు పేర్కొన్నారు. భీమవరం శివారు దుర్గాపురం యుపిహెచ్‌సి ఆసుపత్రిని ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల వచ్చిన తుపాను ప్రభావంతో ఆస్పత్రి ఆవరణలో పడిపోయిన చెట్లను, కూలిపోయిన ప్రహారీ గోడను ఆయన పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి రికార్డులు, ఓపి నమోదు, ల్యాబ్‌ పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోగి వివరాలను ఓపి రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో దుర్గాపురం యూపీహెచ్‌సీ వైద్యురాలు మాధురి, హెచ్‌వీ కుమారి, స్టాఫ్‌ నర్స్‌ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ద్వారకాతిరుమల: శ్రీవారి హుండీల లెక్కింపు బుధవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో పారదర్శకంగా నిర్వహించినట్లు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. ఏలూరు జిల్లా దేవాదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు, ఆలయ ట్రస్ట్‌బోర్డు సభ్యులు, పోలీసుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు నిర్వహించారు. గడిచిన 27 రోజులకు గాను స్వామివారికి నగదు రూపంలో రూ.2,52,47,879 ఆదాయం సమకూరింది. రోజుకు సగటున రూ.9,35,107 ఆదాయం వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. నగదుతో పాటు కానుకల రూపంలో 127 గ్రాముల బంగారం, 3.466 కేజీల వెండి, భారీగా విదేశీ కరెన్సీ లభించాయి. చెల్లుబాటు కాని పాత రూ.2000, రూ.1000, రూ.500 నోట్ల రూపంలో రూ.8,500 వచ్చినట్లు పేర్కొన్నారు.

బుట్టాయగూడెం: మురసు తుపాను కారణంగా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నాలుగు మండలాల్లో గురువారం జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ 6వ తేదీకి వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలకు చెందిన రిటర్నింగ్‌ అధికారులు ఆయా మండలాల్లోని పరిస్థితులను కలెక్టర్‌ దృష్టికి తీసుకురావడంతో ఆమె రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విషయాన్ని నివేదించారు. దీంతో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో గురువారం జరగాల్సిన పోలింగ్‌ను శుక్రవారానికి మార్చుతున్నట్లు కమిషన్‌ తెలియజేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement