భీమవరం: జిల్లాలో గురువారం నిర్వహించే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తు కోసం జిల్లావ్యాప్తంగా 942 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించారు. మొత్తం 621 పోలింగ్ కేంద్రాలలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా 475 సాధారణ, 124 సమస్యాత్మక, 22 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా వర్గీకరించినట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాల వద్ద నుంచి, ఓటింగ్ ముగిసి బ్యాలెట్ పెట్టెలు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరే వరకు ప్రతి దశలోనూ పూర్తి భద్రత కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 122 రూట్ మొబైల్స్, 19 స్ట్రైకింగ్ ఫోర్స్, 13 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించామన్నారు. ఈ ప్రత్యేక బలగాలు గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తాయని తెలిపారు. ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేయాలని, అక్రమంగా మద్యం, నగదు, బహుమతులు తరలించే వారిపై కన్నువేసి ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో తనిఖీలు ముమ్మరం చేశామని, సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు, వదంతులు వ్యాప్తి చేసేవారిపై సైబర్ నిఘా ఉంచామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలు, ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఎస్పీ అద్నాన్ నయీం అస్మి


