తాడేపల్లిగూడెం: విద్యార్థులు కేవలం తరగతి గది బోధనకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రాయోగిక అవగాహన పెంపొందించుకోవాలని ఏపీ నిట్ డైరెక్టర్ డాక్టర్ కె.వి. కృష్ణారావు పిలుపునిచ్చారు. నిట్‌లో బుధవారం ప్రారంభమైన స్కిల్ స్పార్క్ 20 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మారుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. ప్రాజెక్టుల రూపకల్పన, అమలులో ప్రత్యక్ష అనుభవం సాధిస్తే మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పుస్తక జ్ఞానంతో పాటు దానిని ఆచరణలో పెట్టే సామర్థ్యం, నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేసే దృక్పథం విద్యార్థులకు అత్యవసరమని పేర్కొన్నారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు విద్యార్థుల్లో సమస్య పరిష్కార నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ శ్రీఫణికృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించగా.. రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి, డీన్లు వి.సందీప్, ఎన్.జయరామ్, పి.శంకర్, అల్లంశెట్టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


