భీమవరం: వరుసగా సంభవించిన అర్నబ్, మురసు తుపాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పంట పొలాలు జలమయమై పూర్తిగా నీటిలో తేలియాడుతున్నాయి. మంగళ, బుధవారాల్లో జిల్లాలోని 20 మండలాల పరిధిలో మొత్తం 3,155 మి.మీ. వర్షపాతం నమోదైంది. ముందుగా అర్నబ్ తుపానున్‌కు నేలకొరిగిన చేలు, ఆ తర్వాత వచ్చిన మురసు తుపాను వర్షాలకు పూర్తిగా నీటమునిగాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.
ఎకరానికి రూ.30 వేల నష్టం : సార్వా సీజన్ ప్రారంభం నుంచి అనేక కష్టనష్టాలకోర్చి, ఎకరానికి దాదాపు రూ.30,000 వరకు పెట్టుబడి పెట్టి పంటను కాపాడుకున్నామని రైతులు తెలిపారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో వరుస తుఫాన్లు ముంచెత్తడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మురుగునీరు ఎగదన్నుతుండటంతో ఆందోళన
సముద్రం పోటు కారణంగా మురుగునీరు వెనక్కి ఎగదన్నుతుండటంతో చేలలోని నీరు బయటకు పోయే పరిస్థితి లేకుండా పోయింది. వారం రోజుల వరకు నీరు ఇంకే అవకాశం లేకపోవడంతో పంట పూర్తిగా పాడైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు డ్రెయిన్లలో నీటిమట్టం ప్రమాదకరంగా పెరగడంతో గట్లు తెగి గ్రామాలపైకి నీరు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి డ్రెయిన్ల గట్లకు గండ్లు పడకుండా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఉధృతంగా ప్రవహిస్తన్న యనమదుర్రు డ్రెయిన్
తాడేపల్లిగూడెంలో రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు


