న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 3 శ్రీ నవంబర్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: మున్సిపల్ ఎన్నికల ఓట్లు లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో నరసాపురం మున్సిపాల్టీకి సంబంధించి నరసాపురంలోని వైఎన్ కళాశాల, ఆకివీడు నగర పంచాయతీకి ఆకివీడులోని జెడ్పీ హైస్కూల్‌లో ఓట్లు లెక్కింపు జరుగనుంది. మంగళవారం ఉదయం 8 గంటల కౌంటింగ్ మొదలుకానుండగా మ ధ్యాహ్నం 12 తర్వాత నుంచి ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు.
పటిష్ట భద్రత : కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుచేసినట్టు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. కౌంటింగ్ అనంతరం శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు.
ఏర్పాట్లు పూర్తి : నరసాపురం, ఆకివీడు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ సిబ్బంది నియామకం, పోలీసు బందోబస్తు సహా అన్ని ముందస్తు చర్యలు పూర్తి చేశామన్నారు. ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
నరసాపురం.. నాలుగు రౌండ్లు
పుర పోరులో భాగంగా ఆదివారం పోలింగ్ జరిగిన విష యం విదితమే. నరసాపురంలో 46,996 మంది ఓటర్లకు గాను 70.97 శాతంతో 33,543 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో 16,030 మంది పురుషులు, 17,324 మంది మహిళలు ఉన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను వైఎన్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. 36 వార్డుల పరిధిలో మొత్తం 71 పోలింగ్ కేంద్రాలకు గాను 18 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను బయటకుతీసి చైర్‌పర్సన్ అభ్యర్థులకు పోలైన ఓట్లను వేరు చేస్తారు. ఒక్కో దశలో కౌన్సిలర్లు అభ్యర్థులకు పోలైన ఓట్లను లెక్కించిన అనంతరం చైర్‌పర్సన్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. నాలుగు రౌండ్లలో లెక్కింపు పూర్తిచేస్తారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత తొలి ఫలితం వెలువడతాయని అంచనా.
ఆకివీడు.. రెండు రౌండ్లు
ఆకివీడులో 28 వార్డుల పరిధిలో 25,435 ఓటర్లకు 74.47 శాతం పోలింగ్‌తో 19,686 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 9,449 మంది, మహిళా ఓటర్లు 10,237 మంది ఉన్నారు. మొత్తం పోలింగ్ శాతం నమోదైనట్లు కలెక్టర్ వెల్లడించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను ఆకివీడు జెడ్పీ హైస్కూల్‌లోని స్ట్రాంగ్ రూంకు తరలించారు. 32 పోలింగ్ కేంద్రాలకు కౌంటింగ్ నిమిత్తం 16 టేబుళ్లను ఏర్పాటుచేశారు. రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తిచేయనున్నారు. రెండుచోట్ల 300 మందికి పైగా కౌంటింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.
కౌంటింగ్ డే
నరసాపురం వైఎన్ కళాశాల, ఆకివీడు జెడ్పీ హైస్కూల్‌లో కౌంటింగ్
ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
నరసాపురంలో 18, ఆకివీడులో 16 టేబుళ్లు
ముందు కౌన్సిలర్లు, తర్వాత చైర్‌పర్సన్ ఫలితాలు
10 గంటల సమయానికి తొలి రౌండ్ వెల్లడి


