● పోలైన ఓట్లలో మహిళలవే అధికం
● ప్రభుత్వంపై వ్యతిరేకతే కారణమంటూ చర్చ
భీమవరం: జిల్లాలోని నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నరగ పంచాయతీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోవడం కూటమి పార్టీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే చర్చ జరుగుతోంది. రెండు చోట్లా పోలైన ఓట్లులో మహిళలే అధికంగా ఉండటం చర్చకు దారితీసింది. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పలు హామిలిచ్చారు. ముఖ్యంగా పేద మహిళలకు వాగ్దానాలు గుప్పించారు. ప్రధానంగా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తామని, 50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛన్ సదుపాయం కల్పిస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో తమకు ఏడాదికి రూ.18 వేలు ఆర్థిక సాయం అందుతుందనే ఆశతో పెద్ద సంఖ్యలో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేశారు. మహిళా ఓట్లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ప్రధానమైన రెండు హామీలను గాలికి వదిలేసింది. తమకు నేరుగా లబ్ధి చేకూరకపోవడంతో మహిళలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో మహిళలు ఆశించిన స్థాయిలో పథకాలు అమలు చేయలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ తరుణంలో ము న్సిపల్ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో మహిళలు కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేశారంటూ పలువురు లెక్కలు గడుతున్నారు. నరసాపురం మున్సిపాల్టీలో మొత్తం 49,996 ఓట్లకుగాను 33,354 ఓట్లు పోల్ కాగా వాటిలో సుమారు 17,354 మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆకివీడు నగర పంచాయతీలో 25,435 ఓట్లకుగాను 19,689 మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 13,817 మంది మహిళలకుగాను 10,237 మంది మహిళలు ఓటు వేయడం చర్చనీయాంశంగా మారింది. మహిళలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి మరి.


