ఏలూరు టౌన్: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు ఓటర్లను భయ భ్రాంతులకు గురిచేయటంతో పోలింగ్ శాతం తగ్గిందనీ.. ఓట్ల లెక్కింపులో వైఎస్సార్‌సీపీ మేయర్, అధిక సంఖ్యలో కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపు ఖాయమని వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ అన్నారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నగరంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లపై కూటమి నాయకులు, కార్యకర్తలు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ప్రజలంతా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచారనీ అన్నారు. మేయర్‌తోపాటు అధిక సంఖ్యలో కార్పొరేటర్ స్థానాలు పార్టీ కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
కూటమి నేతల ఇష్టారాజ్యం
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించకుండా, ఆంక్షలను లెక్కచేయకుండా కూటమి పార్టీలకు చెందిన కొందరు అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా నిబంధనలు ఉల్లంఘించారని సమన్వయకర్త జేపీ ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ తమపార్టీకే ఓట్లు వేయాలంటూ ఒత్తిడి చేశారని విమర్శించారు. అధికార బలం, ప్రలోభాలకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారని ఆరోపించారు. నగరంలోని 38వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుస్తుందనే భయంతో టీడీపీ నాయకుల ప్రోద్బలంతో వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీను, డివిజన్ ఇన్‌చార్జి యక్కల నాని, కార్యకర్త బాషాపై దాడులు చేశారన్నారు. 40వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి రాజేశ్వరరావు తమ పార్టీ నాయకురాలు రాణిని అసభ్యపదజాలంతో దూషించారనీ, మహిళలపై మీకున్న చిత్తశుద్ధి ఇదేనా అంటూ ప్రశ్నించారు. 55వ డివిజన్‌లో మాజీ డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవానీ శ్రీనివాస్ తమ పార్టీ కార్యకర్తపై దాడి చేశారని సమన్వయకర్త జేపీ తెలిపారు. అలాగే ఆదివారం రాత్రి 10 గంటలకు తమ పార్టీ నాయకుడు వెంకట్‌పై ఏకంగా 50 మంది దాడి చేశారనీ, బాధితుడు ఏలూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జయప్రకాష్ డిమాండ్ చేశారు.
మహిళలను అగౌరవపరుస్తూ..
బాధితురాలు రాణి మాట్లాడుతూ ఓటు వేసేందుకు తన తల్లి పోలింగ్ బూత్‌లోకి వెళ్లడంతో అక్కడ నిల్చుని ఉన్నాననీ, అదే సమయంలో డివిజన్ అభ్యర్థి రాజేశ్వరరావు తనను దుర్భాషలాడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు ఉందనే అహంభావంతో మహిళలతో అగౌరవంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు. మహిళ పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయటం బాధాకరమని అన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్‌బాబు, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ శాతం తగ్గుదలకు కూటమి నేతలే కారణం
వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం
ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్


