పనిభారం పెంచేదిగా..
చాలా ఇబ్బందులు
పాలకోడేరు : రేషన్ బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు బస్తాలకు క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. బియ్యం దిగుమతి అయ్యేటప్పుడు ఒకసారి, పంపిణీ సమయంలో రెండోసారి ఈ క్యూఆర్ కోడ్‌ను డీలర్లు స్కాన్ చేస్తారని తెలిపారు. అయితే ఈ క్యూఆర్ కోడ్ ట్యాగ్ కేవలం పైన ఉండే గన్నీ (గోనె) సంచులకు మాత్రమే తప్ప, లోపల ఉన్న బియ్యానికి కాదు. అక్రమ రవాణాలో పట్టుబడే బియ్యం ఈ ట్యాగ్‌లు ఉన్న సంచుల్లో ఉండటం లేదు. ఒకవేళ ఆ సంచులతో పట్టుబడితే, అవి ఏ రేషన్ షాపు నుంచి వెళ్లాయో సులభంగా గుర్తించవచ్చు. అయితే వేలా ది బస్తాల బియ్యం ఎలాంటి ట్యాగ్‌లు లేని ప్లాస్టిక్ సంచుల్లోనే సరిహద్దులు దాటుతోందనేది బహిరంగ రహస్యం. బియ్యం నాణ్యత నచ్చకపోయినా, లేదా అవసరం లేకపోయినా.. కార్డుదారులు స్వ యంగా ఇళ్లకు వచ్చే దళారులకే వాటిని అమ్ముకుంటున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోంది. సరైన పరికరాలు సమకూర్చకుండా, రెండుసార్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటూ రేషన్ డీలర్లపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది.
సుమారు 30 వేల మంది డీలర్లు
రాష్ట్రంలో సుమారు 30 వేల మంది రేషన్ డీలర్లు ఉన్నారు. షాపు ఇంటి అద్దె, సహాయకుని జీతం పోను నెలకు ఐదారు వేల రూపాయలు కూడా వీరికి మిగిలని పరిస్థితి. చివరికి ఈ–పాస్ యంత్రాల్లో వాడే పేపర్ రోల్స్‌ను కూడా సరఫరా చే యలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. కనీస వేతన చ ట్టం ప్రకారమైనా తమకు తగిన ఆదాయం డీలర్లు కోరుతున్నారు.
బియ్యం సరఫరాలో జాప్యం
క్యూఆర్ కోడ్ అమలులో సర్వర్ సమస్యతో బియ్యం సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో గత 26 నుంచి ప్రారంభం కావాల్సిన వృద్ధులకు రేషన్ పంపిణీ నిలిచిపోయింది. ఈనెల 2వ తేదీ దాటినా 50 శాతం కూడా రేషన్ షాపులకు బియ్యం సరఫరా కాలేదు. ఏది ఏమైనా క్యూఆర్ స్కానింగ్ తప్పక చేయాల్సిందేనని పౌరసరఫరాల కమిషనర్ కన్నబాబు అంటున్నారు.
పౌరసరఫరాల వ్యవస్థలో సంస్కరణలు, ఆధునిక సాంకేతికతను స్వాగతిస్తున్నాం. అయితే ఆది పనిభారం పెంచేదిగా ఉండకూడదు. టెక్నాలజీ పెరిగే కొద్దీ సరళీకృతం కావాలి. రేషన్ డీలర్ల కుటుంబాల సంక్షేమం గురించి కూడా ఆలోచించాలి.
– సోము సాయికృష్ణ, పాలకోడేరు మండల రేషన్ల డీలర్ల సంఘ కార్యదర్శి
రేషన్ బియ్యం అక్రమ రవాణాలో మాఫియాను గుర్తించకుండా డీలర్లను బాధ్యులు చేయడం సరి కాదు. పలువురు చిరువ్యాపారులు లబ్ధిదారుల ఇళ్లకువెళ్లి బియ్యాన్ని కొంటున్నారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో మాకు ఇబ్బందులే.
– గాజులపాటి గంగాధర్, ఏలూరు జిల్లా రేషన్ల డీలర్ల సంఘ అధ్యక్షుడు
రేషన్ పంపిణీలో ఇక్కట్లు
3వ తేదీ వచ్చినా వృద్ధులకు అందని సరుకుల
50 శాతం కూడా షాపులకు చేరని బియ్యం


