తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళకు రూ.10 వేల జరిమానా | - | Sakshi
Sakshi News home page

తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళకు రూ.10 వేల జరిమానా

Oct 3 2026 1:38 AM | Updated on Oct 3 2026 1:38 AM

తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళకు రూ.10 వేల జరిమానా హీల్‌ పాఠశాలకు జాతీయ సీబీఎస్‌ఈ అవార్డు టెన్నిస్‌ సెలెక్షన్లు విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

భీమవరం: తన కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఓ వ్యక్తిపై తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళకు పోక్సో కోర్టు జడ్జి బి. లక్ష్మీనారాయణ రూ.10 వేల జరిమానా విధించినట్లు భీమవరం డీఎస్పీ రఘువీర్‌ విష్ణు తెలిపారు. కేసు వివరాలను శుక్రవారం ఆయన తన కార్యాలయంలో వెల్లడించారు. భీమవరం బీసీ కాలనీకి చెందిన మహిళ 2025 మే 7న అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిపై టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టింది. పోలీసులు విచారణ జరిపి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. విచారణలో ఆ ఫిర్యాదు తప్పుడుదని రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో టూటౌన్‌ సీఐ పి. మురళీకృష్ణ, ఎస్‌ఐ రామారావు పాల్గొన్నారు.

ఆగిరిపల్లి: మండలంలోని తోటపల్లిలో హీల్‌ సీబీఎస్‌ఈ పాఠశాలకు విద్యారంగంలో చేసిన సేవలకు గాను జాతీయ స్థాయి అవార్డు లభించినట్లు సంస్థ సీఈఓ కూరపాటి అజయ్‌కుమార్‌ తెలిపారు. వేలాది మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పించడంతో పాటు సీబీఎస్‌ఈ 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షల్లో వరుసగా 100 శాతం ఉత్తీర్ణత సాధించినందుకు ఈ పురస్కారం దక్కిందన్నారు. ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో బ్రెయిన్‌ ఫెడ్‌ సంస్థ ఫౌండర్‌ కేవీ బ్రాహ్మం చేతుల మీదుగా హీల్‌ అకాడమిక్‌ డైరెక్టర్‌ యు.మణికుమారి, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎం. హరీష్‌ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా హీల్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ కోనేరు సత్యప్రసాద్‌, కార్యదర్శి తాతినేని లక్ష్మి, సిబ్బందిని పాలకవర్గం అభినందించింది.

భీమవరం: భీమవరం యూత్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏపీఎల్టీఏ జిల్లా టెన్నిస్‌ జట్ల ఎంపిక ప్రక్రియ శుక్రవారం నిర్వహించారు. అండర్‌–10, 12, 14, 16 విభాగాలతో పాటు పురుషులు, మహిళలు, 35+ ప్లస్‌ విభాగాల్లో సెలక్షన్స్‌ చేపట్టినట్లు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పేరిచర్ల వెంకట శ్రీనివాసరాజు (సుభాష్‌) తెలిపారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. గత 25 ఏళ్లుగా క్రీడలను ప్రోత్సహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఎల్టీఏ సెక్రటరీ కుమార్‌, డీఎస్‌, డాక్టర్‌ రంగప్రసాదరాజు, కోచ్‌ మురళి తదితరులు పాల్గొన్నారు.

ఆకివీడు: మండలంలోని చినమిల్లిపాడు గ్రామంలో విద్యుత్‌ షాక్‌ గురై బలే వెంకట్రావు (48) అనే వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. తెలంగాణలో ఉపాధి పొందుతున్న వెంకట్రావు, స్వగ్రామంలో ఇల్లు నిర్మించుకునేందుకు ఇటీవల వచ్చాడు. ఇంటి పనులు చేస్తుండగా సమీపంలోని డబ్బా ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి విద్యుత్‌ సరఫరా కావడంతో తీవ్రంగా షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇటీవల అయ్యప్ప మాల ధరించిన వెంకట్రావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement