నరసాపురం రూరల్: అత్తవారింటి ముందు పది రోజులుగా దీక్ష చేస్తున్న కొమరాడ దేవి దివ్యను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ శుక్రవారం పరామర్శించారు. ఎల్బీచర్లకు చెందిన దుర్గాప్రసాద్‌తో ఏడేళ్ల క్రితం దేవి దివ్యకు వివాహమైంది. భర్త వేధింపులకు గురిచేస్తుండటంతో కోర్టును ఆశ్రయించగా, భార్యతో కలిసి కాపురం చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ భర్త ఆమెను చేర్చుకోకపోవడంతో బాధిత మహిళ అత్తవారింటి ముందే దీక్షకు దిగింది. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పోలీసులు సమస్యను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. బాధితురాలికి మద్దతుగా నిలవాల్సిన పోలీసులు ఆమెను అవమానించడం తగదన్నారు. అధికారులు వెంటనే స్పందించి భర్త దుర్గాప్రసాద్‌ను తీసుకువచ్చి ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు జల్లి రామ్మోహనరావు, పొగాకు నారాయణరావు పాల్గొన్నారు.


