నిడదవోలు రూరల్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను సమిశ్రగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ఎల్. బాలాజీ సుందరరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం జువ్వలపాలేనికి చెందిన మరపట్ల రాజ్‌కుమార్, రాజమహేంద్రవరం చర్చిపేటకు చెందిన చిప్పాడ ప్రవీణ్ కుమార్ గతంలో వేర్వేరు నేరాలకు సంబంధించి జైలుకు వెళ్లారు. అక్కడ వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇలా జైలులో పరిచయమైన ఇద్దరూ ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో అప్పటి నుంచి వారు కలిసి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో నిడదవోలు మండలం సమిశ్రగూడెం లోహియానగర్ వద్ద కవర్‌లో పెట్టి గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పక్కా సమాచారంతో వారిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2.080 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాజ్‌కుమార్‌పై ఇప్పటికే తాడేపల్లిగూడెం, నిడదవోలుతో పాటు పలు పోలీసు స్టేషన్లలో దొంగతనం కేసులు ఉండగా.. ప్రవీణ్ కుమార్‌పై గంజాయి విక్రయాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


