ఈ ఏడాది ఐదు అంశాలపై కార్యక్రమం ఇలా..
● నేటి నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు
● ఏలూరులో పకడ్బందీ ఏర్పాట్లు
కై కలూరు: పోషకాహార లోపరహిత సమాజమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘జాతీయ పోషణ మాసోత్సవాలు’ ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ‘మన అంగన్‌వాడీ – మన బాధ్యత’ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్నారులు, కిషోర బాలికలు, గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబరు 9 నుంచి అక్టోబరు 8 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక కార్యచరణ రూపొందించారు.
ఏలూరు జిల్లాలో ఇలా..
ఏలూరు జిల్లా పరిధిలోని 2,226 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలో 3 సంవత్సరాల లోపు పిల్లలు 47,450 మంది, 3–6 సంవత్సరాల లోపు పిల్లలు 7,163 మంది, అలాగే బాలింతలు ఉన్నారు. కలెక్టర్ కే.వెట్రిసెల్వీ ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి 8 వరకు ముందస్తు సన్నాహక కార్యక్రమాలు పూర్తి చేశారు. ప్రాజెక్టు స్థాయిలో నెల రోజుల క్యాలెండర్‌ను తయారు చేయడంతో పాటు బ్యానర్లు, కరపత్రాలు, పోస్టర్లను పంపిణీ చేశారు. అక్టోబరు 9 నాటికి జిల్లా సమగ్ర నివేదికను రాష్ట్ర కార్యాలయానికి అందించనున్నారు.
వారణాసిలో జాతీయ ప్రారంభం
మొదటి రోజు జాతీయ ప్రారంభ కార్యక్రమం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరగనుంది. వెబ్‌కాస్ట్ ద్వారా దీన్ని తిలకించిన అనంతరం, మధ్యాహ్నం 1 గంట తర్వాత జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
మీడియా సమావేశం నిర్వహించి జిల్లా కార్యచరణ ప్రణాళికను విడుదల చేస్తారు. ఇదే రోజు ప్రాజెక్టు పరిధిలో ప్రారంభ సభలు, ప్రతిజ్ఞలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏకకాలంలో ప్రారంభ ధ్రువీకరణ, ఏఎంసీ సభ్యులు, తల్లులతో సమావేశాలు, ఫొటోలు, వీడియో డాక్యుమెంటేషన్లు చేపడతారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు శిశు సంక్షేమ శాఖతో పాటు వైద్యారోగ్యం, విద్య, సమగ్రశిక్ష, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయం, ఉద్యానవనం, ఆహార భద్రత శాఖలు, ఎన్‌జీవోలు సంయుక్తంగా పనిచేయనున్నాయి.
పోషకాహార విలువలు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నెల రోజుల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏఎంసీ సమావేశం, రుచి పరీక్ష, వంటల ప్రదర్శన, పోషణ్ మేళా, పీఎంఎంవీవై నమోదు శిబిరం జరగాలి. ప్రతి కార్యక్రమం అరనిమషం వీడీయో, హెచ్‌డీ ఫొటోలు జన్ ఆందోళన్ డ్యాష్ బోర్డులో నమోదు చేయాలి. ప్రతీ అంగన్‌వాడీ కేంద్రానికి 10 అంశాల కార్యక్రమాన్ని రూపొందించాం.
– పి.శారద, ఉమెన్, చైల్ట్ వెల్ఫేర్ ఎంపవర్‌మెంట్ ఆఫీసర్, ఏలూరు జిల్లా
క్ర.సం అంశం నిర్వహణ తేదీలు
1. ఆహార వైవిద్యం – తగినంత ప్రోటీన్ సెప్టెంబరు 10–15
2. అంగన్‌వాడీ కేంద్రాల్లో తాజా వేడి భోజనం సెప్టెంబరు 16–21
3. సమాజ భాగస్వామ్యం, జవాబుదారితనం సెప్టెంబరు 22–26
4. పోషణ, బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ సెప్టెంబరు 27–అక్టోబరు 01
5. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన అక్టోబరు 02–08


