పంట పొలాలను బొగ్గు పాలు చేస్తారా? | - | Sakshi
Sakshi News home page

పంట పొలాలను బొగ్గు పాలు చేస్తారా?

Sep 9 2026 3:22 AM | Updated on Sep 9 2026 3:22 AM

చింతలపూడి: రిలయన్స్‌ కార్పొరేట్‌ లాభాల కోసం అన్నదాతల జీవితాలను, పచ్చని వ్యవసాయ క్షేత్రాలను బొగ్గు పాలు చేస్తారా? అని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాఘవాపురం శివారు అంకులయ్య కొత్తగూడెంలో బొగ్గు గని ప్రభావిత ప్రాంత రైతుల అత్యవసర సమావేశం మంగళవారం రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ‘మా భూమి–మా హక్కు’, ‘రిలయన్స్‌ కు భూములివ్వం’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ రిలయన్స్‌ బొగ్గు ఆధారిత గ్యాస్‌ (యూసీజీ) ప్రాజెక్టు కోసం సుమారు 10 వేల ఎకరాల భూసేకరణ జరుపుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. స్థానిక రైతులతో కనీస చర్చలు జరపకుండా, వారి ఆమోదం లేకుండా బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పాలకులు మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం 5 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వమే చెబుతోందని, కానీ ఇక్కడ ఆయిల్‌ పామ్‌, కొబ్బరి, కోకో, మొక్కజొన్న, వరి పంటలపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ భూములు కోల్పోతే రైతులు, వ్యవసాయ కార్మికుల ఉపాధి పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూసీజీ ప్రక్రియ వల్ల తలెత్తే పర్యావరణ ముప్పును అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని, ప్రాజెక్టు సమగ్ర నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణను మొక్కుబడిగా కాకుండా, ప్రజల అభీష్టానికి అనుగుణంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పి. పాండురంగారావు, సీఐటీయూ జిల్లా నాయకులు ఆర్‌.వి.ఎస్‌. నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు సత్యనారాయణతో పాటు రైతులు చీకటి శ్రీనివాసరావు, శెట్టిపల్లి ప్రసాద్‌, మామిళ్ళపల్లి అప్పారావు, బాలా నరసింహారావు, చీకటి వెంకట సత్యనారాయణ, చీకటి రజని, మట్టా దమయంతి, మోరంపూడి శ్రీనివాసరావు, చీకటి సర్వేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement