గోదావరి తీరాన క్రీడా కెరటాలు | - | Sakshi
Sakshi News home page

గోదావరి తీరాన క్రీడా కెరటాలు

Aug 29 2026 2:04 AM | Updated on Aug 29 2026 2:04 AM

క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం

పట్టుదలే సఫలతకు మూలం

నేడు జాతీయ క్రీడా దినోత్సవం

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో

విరివిగా కార్యక్రమాలు

కై కలూరు: ఉమ్మడి గోదావరి జిల్లాలు క్రీడా రంగానికి నిలయంగా మారాయి. ఇక్కడి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

ఏలూరు జిల్లాకు చెందిన దివ్యాంగ ఈతగాడు బాలగ గణేష్‌ శ్రీలంకలోని తలైమన్నార్‌ నుంచి భారత్‌లోని ధనుష్కోటి వరకు 28 కిలోమీటర్ల సముద్ర భాగాన్ని కేవలం 10 గంటల 30 నిమిషాల్లో ఈది రికార్డు సృష్టించాడు. అలాగే ముదినేపల్లి మండలం చిగురుకోటకు చెందిన కోమటి వెంకట కృష్ణారెడ్డి రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీల్లో పతకాలు సాధించి, 2వ ఆసియా మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత పొందారు. తణుకు చెందిన జ్యోతికశ్రీ పారిస్‌ ఒలింపిక్స్‌ – 2024లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. అలాగే ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌లో భీమవరం బుల్స్‌ విజేతగా నిలవగా, ఈషా గ్రామోత్సవంలో ఏలూరు జిల్లా మల్లవరం జట్టు వాలీబాల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. క్రికెట్‌లో కేఎస్‌ భరత్‌, గిరినాథ్‌రెడ్డి, షోయబ్‌ మహమ్మద్‌ ఖాన్‌, తన్నేరు భరత్‌, పారా అథ్లెటిక్స్‌లో పవన్‌ కుమార్‌; స్విమ్మింగ్‌లో స్వామినాయుడు, మోహనదీప్తి, ధనూష్‌, యశస్విని, కరాటేలో చింతపల్లి శ్రేయాన్స్‌, కందుల జుహిత్‌రాజ్‌లు వివిధ స్థాయిల్లో రాణిస్తున్నారు.

నేడు ప్రత్యేక కార్యక్రమాలు

హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 28 నుంచి 30 వరకు ఏలూరు, పశిమ గోదావరి జిల్లాల్లో క్రీడా పోటీలు, సైకిల్‌ ర్యాలీలు, ప్రతిభావంతులైన క్రీడాకారులు, కోచ్‌లకు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఖేల్‌ కీ బాత్‌ – పీఎం కే సాత్‌ పేరిట విష్ణు కాలేజీ నుంచి వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. శనివారం ఏక్‌ ఘంటా ఖేల్‌ కే మైదాన్‌ పిలుపులో భాగంగా ప్రతి ఒక్కరూ గంట పాటు మైదానంలో ఆటలు ఆడనున్నారు. అలాగే ఇటీవల ముగిసిన అమరావతి ఛాంపియన్‌షిప్‌ – 2026 విజేతలకు జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు. ప్రస్తుతం మై భారత్‌ పోర్టల్‌ ద్వారా యువ సంవాద్‌ ప్లాట్‌ఫామ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.

అందుబాటులో ఉన్న క్రీడా మైదానాలు

ఏలూరు జిల్లాలో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఏఎస్‌ఆర్‌ క్రీడా ప్రాధికార సంస్థ, వెస్ట్‌ గోదావరి డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, ఏలూరు క్రికెట్‌ టర్ఫ్‌, ఏబీ బాక్స్‌ క్రికెట్‌, ఈస్టర్న్‌ బ్యాడ్మింటన్‌ కోర్ట్‌, షోటోకాన్‌ స్పోర్ట్స్‌ కరాటే ఆర్గనైజేషన్‌, స్కేటింగ్‌ రింక్‌ అందుబాటులో ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలక్ష డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ అథారిటీ, భీమవరం టెన్నిస్‌ కోర్ట్‌, ఆచంట, ఇరగవరం క్రీడా వికాస కేంద్రాలు, ఏసీఏ డీఎన్నార్‌ కాలేజీ గ్రౌండ్‌, మ్యాగ్‌ స్పోర్ట్స్‌, చిరంజీవి బాక్సింగ్‌ క్లబ్‌, సుమన్‌ షోటోకాన్‌ కరాటే అకాడమీ వంటి క్రీడా మైదానాలు అందుబాటులో ఉన్నాయి.

ఆటల వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. క్రీడల్లో పాల్గొనడం వల్ల శ్రమ, అలసట తగ్గి రాత్రి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. తద్వారా మరుసటి రోజు పనిలో చురుకుదనం పెరుగుతుంది. నేటి యువత పబ్‌జీ వంటి డిజిటల్‌ గేమ్‌లకు దూరంగా ఉండి మైదానాల్లో ఆడాలి. ప్రభుత్వాలు క్రీడా కోటా శాతాన్ని పెంచాలి.

– డాక్టర్‌ ఎం. శ్రీనివాసరెడ్డి,

నేషనల్‌ వాలీబాల్‌ రెఫరీ, రెడ్డినగర్‌

క్రీడల్లో రాణించడానికి కృషి, పట్టుదల చాలా అవసరం. నేను నిర్మాణ రంగంలో ప్రాజెక్ట్‌ టీమ్‌ లీడర్‌గా పనిచేస్తూనే స్విమ్మింగ్‌ సాధన చేశాను. జాతీయ పోటీల్లో రాణించి బెంగుళూరులో జరిగే 2వ ఆసియా మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ పోటీలకు అర్హత సాధించాను. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి మంచి పేరు తేడమే నా లక్ష్యం.

– కోమటి వెంకట కృష్ణారెడ్డి, స్విమ్మర్‌, చిగురుకోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement