పాలకొల్లు సెంట్రల్: పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో కొందరు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదని, ఎలాంటి కార్యక్రమాలైనా ముందుగా ఆలయ వర్గాలకు తెలియజేయాలని ట్రస్ట్‌బోర్డు చైర్మన్ మీసాల రామచంద్రరావు (రాము) స్పష్టం చేశారు. గురువారం సాక్షిలో ‘క్షీరారామం ఇష్టారాజ్యం’ పేరుతో కథనం ప్రచురితం కావడంతో శుక్రవారం ఆలయ చైర్మన్, ఈఓ, ట్రస్ట్‌బోర్డు సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రాము మాట్లాడుతూ తమ పాలకమండలి బాధ్యతలు చేపట్టి ఎనిమిది నెలలవుతున్నా మీడియాతో సమాచార లోపం ఏర్పడిందన్నారు. భక్తులకు సేవ చేయడానికే తాము ఉన్నామని, ఏదైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావచ్చని కోరారు. గత రెండు రోజులు క్రితం క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో అరుణాచలం నుంచి ఓ మాతాజి వచ్చి భక్తులకు రుద్రాక్షలు అందజేశారు. ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్‌కు ముందుగా తెలియపరచకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమాన్ని కూటమి పార్టీకి చెందిన ఓ పార్టీ నాయకుడు నిర్వహించినట్లు సమాచారం. ఈ విషయం గురించే మీరు మాట్లాడుతున్నారా? అని విలేకరులు చైర్మన్ రామును ప్రశ్నించగా అలా అని ఎందుకు అనుకోవాలి. గతంలో ఒకరు సేవా సంస్థ అంటూ పది మందికి సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పుతున్నామంటూ వారి ఇష్టానుసారం చేసుకుంటూ వెళ్లిపోయారని తెలిపారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రహరీ నిర్మాణ ఆలస్యానికి పురావస్తు, దేవదాయ శాఖల మధ్య సమన్వయ లోపం కారణం కాదని వివరణ ఇచ్చారు. కేరళ ఎన్నికల వల్ల పురావస్తు శాఖ అనుమతుల్లో ఆలస్యం జరిగిందని, మరో రెండు మూడు రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే ఆలయంలో తీవ్ర సిబ్బంది కొరత ఉందని, సాంకేతిక అవసరాల కోసమే తాత్కాలికంగా బయటి వ్యక్తుల సేవలు వాడుకుంటున్నామని చెప్పారు. వీరభద్రస్వామి ఆలయం వద్ద లాకర్ రూమ్, నిత్యాన్నదానం వంటి భక్తుల వసతులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. నాలుగో శ్రావణ శుక్రవారం నాడు సుమారు 1,500 మందితో సామూహిక వరలక్ష్మీవ్రతం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.


