ఆగిరిపల్లి: అనుమతుల పేరుతో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండలంలోని కనసానపల్లి రైతులు డిమాండ్ చేశారు. మండలంలోని తోటపల్లిలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిన భూమిని చదును చేసే నెపంతో, కొండ ప్రాంతం నుంచి వందలాది లారీలలో గ్రావెల్‌ను బయటకు తరలిస్తున్నారు. శుక్రవారం గ్రామస్తులు, రైతులు లారీలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రైతులు గురజాల రమేష్, ఆలూరు రామ్మోహన్ మాట్లాడుతూ రోజువారీ లారీల రవాణా వల్ల కొండ చుట్టూ ఉన్న 200 ఎకరాల్లోని వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతికి తరలిస్తున్నామని చెబుతూ, నున్న పరిసర ప్రాంతాల్లోని వెంచర్లకు గ్రావెల్‌ను అక్రమంగా విక్రయిస్తూ లక్షలు ఆర్జిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఏఎంఆర్ కంపెనీ సిబ్బంది, క్వారీ నిర్వాహకులు కుమ్మకై ్క బిల్లుల అక్రమాలకు పాల్పడుతున్నారని, కనసానపల్లి సరిహద్దులోని కొండను కూడా తవ్వేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రయాణికుల వాహనాలపై శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇన్సూరెన్స్, పన్ను చెల్లింపుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే బస్సుల్లో అత్యవసర ద్వారాలు (ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు), అగ్నిమాపక పరికరాలు (ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు), ప్రథమ చికిత్స పెట్టెలు, టైర్లు, లైట్లు, బ్రేకుల స్థితిగతులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపే వాహనాలపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, వాహనాలను అనువైన స్థితిలో ఉంచాలని యాజమాన్యాలకు, పరిమితి వేగంతో వాహనాలు నడపాలని డ్రైవర్లకు సూచించారు.


