మూడేళ్లుగా ఎదురుచూస్తున్నాం
కూలి పనులే దిక్కయ్యాయి
● డిసెంబరు నాటికి చల్లావారిగూడెం కాలనీకి తరలింపునకు ఏర్పాట్లు
● గౌరవంగా జీవించేందుకు ఆదాయ మార్గాలు చూపాలని డిమాండ్
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలో ముంపునకు గురవుతున్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నిర్వాసిత కుటుంబాలను ఈ ఏడాది డిసెంబరు నాటికి చల్లావారిగూడెం పునరావాస కాలనీకి తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. అక్కడ ఇళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతున్నప్పటికీ, తమ జీవనోపాధిపై స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంపై నిర్వాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా వ్యవసాయం, కూలి పనులు, అటవీ ఆధారిత వృత్తులు, చిన్న వ్యాపారాలపై ఆధారపడిన తమకు కొత్త ప్రాంతంలో ఉపాధి చూపకపోతే కుటుంబ పోషణ భారంగా మారుతుందని వాపోతున్నారు.
గత అనుభవాలే నేటి భయాలు
ఇప్పటికే పునరావాస ప్రాంతాలకు వెళ్లిన కుటుంబాలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతుండటమే ప్రస్తుత నిర్వాసితుల ఆందోళనకు ప్రధాన కారణం. సొంత ఊరు, సాగు భూములు, అడవితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని కొత్త వాతావరణంలో జీవనం ఎలా సాగించాలనే ప్రశ్న వెంటాడుతోంది.
మాకు కావాల్సింది ఇల్లు కాదు... భవిష్యత్తు
2013 భూసేకరణ, పునరావాస చట్టం స్ఫూర్తికి అనుగుణంగా కేవలం నష్టపరిహారం, ఇళ్లు ఇవ్వడమే కాకుండా జీవనోపాధిని కూడా పునరుద్ధరించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్వాసిత కుటుంబాల్లోని యువత, రైతులు, కూలీలు, చిన్న వ్యాపారుల నైపుణ్యాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అర్హతలకు తగ్గట్టుగా స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించాలని, లేకపోతే పొట్ట చేతపట్టుకుని వలసలు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. డిసెంబరుకు తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, తమ జీవితాలను ఎలా నిలబెడుతుందో స్పష్టతనివ్వాలని, తమకు కావాల్సింది కేవలం ఇల్లు మాత్రమే కాదని, గౌరవంగా బతికేందుకు ఉపాధి అని తేల్చిచెబుతున్నారు.
2022 గోదావరి వరదల కారణంగా వేలేరుపాడు మండలం నుంచి పునరావాస కాలనీకి వచ్చాం. నాటి నుంచి నేటి వరకు ఉపాధి లేక నానా అవస్థలు పడుతున్నాం. అవకాశాలు కల్పించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. – బద్దె ప్రసన్న కుమార్, శ్రీరామ్‌పురం ఆర్ అండ్ ఆర్ కాలనీ
వేలేరుపాడులో ఉన్నప్పుడు సొంతంగా వ్యవసాయ పనులు చేసుకునేవాళ్లం. కానీ పునరావాస కాలనీకి వచ్చిన తర్వాత ఏ పనీ లేక కూలి పనులకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం తక్షణమే మాకు శాశ్వత ఉపాధి చూపించాలి.
– ముత్తబోయిన వెంకటరమణ, వేలేరుపాడు నిర్వాసితుడు


