ఉంగుటూరు: 108 అంబులెన్స్‌లో ఓ మహిళ సురక్షితంగా మగబిడ్డకు జన్మనిచ్చింది. చేబ్రోలుకు చెందిన ఉప్పులూరు షకిన రాణి ప్రసవం కోసం శుక్రవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాగా, పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో వైద్యులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఉంగుటూరు 108 వాహనంలో ఆమెను తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువై ప్రసవమైంది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. సమయానుకూలంగా స్పందించి ప్రసవం చేసిన 108 ఈఎంటీ అనిల్ కుమార్, పైలట్ రామారావులను రోగి బంధువులు అభినందించారు.
నరసాపురం రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందిన సంఘటన నరసాపురం సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై కట్టా శారదా సతీష్ తెలిపిన వివరాల ప్రకారం రుస్తుంబాద మంగళగుంటపాలెం గ్రామానికి చెందిన బండారు జాస్ఫర్ (29) అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా, 216 జాతీయ రహదారి సీతారామపురం రోడ్డులోని సెవెన్త్ డే స్కూల్ సమీపంలో నిలిపి ఉంచిన ఓఎన్జీసీ పైపుల లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి ముత్యాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సీఐ నాగరాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మండవల్లి: స్థానిక వ్యవసాయ కార్యాలయంలో వివిధ వ్యవసాయ పథకాలపై మండల అధికారులతో జిల్లా వ్యవసాయాధికారి షేక్ హబీబ్ బాషా శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని ఫసల్ బీమా యోజన గడువు ఈ నెల 31తో ముగుస్తున్నందున, ప్రతి రైతుతో పంట బీమా చేయించేలా క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. బీమా చేయించుకున్న వారంతా తప్పనిసరిగా ఈ–పంటలో నమోదు కావాలని, ఆ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని గ్రామ వ్యవసాయ సహాయకులను ఆదేశించారు. అలాగే ఎల్‌నినో ప్రభావం, కౌలు రైతు గుర్తింపు కార్డుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండవల్లి ఏఓ విద్యాసాగర్, ముదినేపల్లి ఏఓ బలగాని వేణుమాధవ్ పాల్గొన్నారు.
కామవరపుకోట: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జూనియర్, సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక ఆదివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మిడతా రమేష్ బాబు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనేవారు 01–01–2012 తర్వాత, జూనియర్ విభాగంలో పాల్గొనేవారు 01–01–2009 తర్వాత జన్మించి ఉండాలని వివరించారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరుకావాలని కోరారు. ఎంపికై న సబ్ జూనియర్ జట్లకు విజయనగరంలో, జూనియర్ జట్లకు కడపలో రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయని వెల్లడించారు. వివరాలకు 94933 39424 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.


