తాడేపల్లిగూడెం: విద్యార్థులు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని ఐఐటీ హైదరాబాద్ ఆచార్యులు ప్రమోద్ కె.నాయర్ పిలుపునిచ్చారు. సైన్స్, బాధ్యత, హక్కులను పొందే హక్కు అనే అంశంపై బీటెక్ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు శుక్రవారం రవీంద్రభారతి ఆడిటోరియంలో సామాజిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞానం కేవలం విద్యా, పరిశోధనా రంగాలకే పరిమితం కాకుండా, సమాజాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడాలన్నారు. విద్యార్థులు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని, హక్కులను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని కోరారు. డీన్ (స్టూడెంట్ వెల్ఫేర్) డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ జి.బి.వీరేష్‌కుమార్, డాక్టర్ సౌమ్య, టి.రేష్మా తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం రాజమహేంద్రవరం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజినల్ డైరెక్టర్ (ఆర్‌డీఎంఏ) ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల ముందస్తు సంసిద్ధతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌డీఎంఏ మాట్లాడుతూ వచ్చే నెల 3న వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ (పబ్లికేషన్) జరగాల్సి ఉన్నందున, సంబంధిత ఏర్పాట్లన్నింటినీ గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఓటర్ల వివరాల ఆన్‌లైన్ నమోదు, ప్రింటింగ్ ప్రక్రియల్లో ఎలాంటి సాంకేతిక లేదా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూడాలన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 29 వార్డులను సవరించి కొత్తగా 32 వార్డులుగా పునర్విభజించినట్టు చెప్పారు. పట్టణంలో 48,463 మంది ఓటర్లు ఉన్నారన్నారు.


