ద్వారకాతిరుమల: జంగారెడ్డిగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ద్వారకాతిరుమల సెక్టార్ సమావేశాన్ని ఆర్‌జేడీ సుజాత రాణి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై సమీక్షించిన ఆమె, కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేసేలా గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కేంద్రాలకు తాగునీటి సౌకర్యం, ఓవర్ హెడ్ ట్యాంకుల ఏర్పాటుకు పంచాయతీ ప్రత్యేక అధికారులతో మాట్లాడాలని సీడీపీఓ, సూపర్‌వైజర్లను ఆదేశించారు. అంగన్‌వాడీల ద్వారా ఆర్‌ఎల్‌ఎం సందేశాలను తల్లుల గ్రూపులకు పంపాలని, ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ప్రభుత్వం అందించే ఐసీడీఎస్ సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. నవచేతన యాప్‌లో 0 నుంచి 5 ఏళ్ల పిల్లలందరికీ స్క్రీనింగ్ వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో నోడల్ ఆఫీసర్ ఇ.తులసి, సీడీపీఓ పి.బ్యూలా తదితరులు పాల్గొన్నారు.


