తణుకు అర్బన్: స్థానిక పాతవూరులో గురవాని అనుదీప్తి (20) అనే యువతి శుక్రవారం నివాస గృహంలో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువు పూర్తి చేసుకున్న ఆమె, తల్లిదండ్రులు లేకపోవడంతో బాబాయి తమరాపు దుర్గాప్రసాద్ వద్ద ఉంటోంది. అయితే ఆమె మృతదేహాన్ని ఖననం చేసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తుండగా, గమనించిన స్నేహితులు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్సై సీహెచ్‌వీ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది ఆత్మహత్యా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.


