సబ్సిడీ రూ.10 వేలకు పెంచాలి
నరసాపురం: అంతర్జాతీయ పరిణామాల కారణంగా డీజిల్ ధర లీటరుకు రూ.105కి చేరడంతో సముద్రంలో వేట సాగించే మత్స్యకారులపై తీవ్ర ఆర్థిక భారం పడింది. ఏటా విధించే వేట నిషేధం గడువు ముగిసి, గత నెల 15న వేట ప్రారంభమైనా వాతావరణ పరిస్థితులు వారికి అనుకూలించలేదు. తీవ్రమైన ఎండలు, వర్షాలు పడకపోవడంతో సముద్రంలో అనుకున్నంతగా చేపలు దొరకడం లేదు.
వేట భారం.. ఆదాయంలో లోటు
ఒక్కో బోటు సముద్రంలో వేటకు వెళ్తే సరుకు లభ్యతను బట్టి 10 నుంచి 20 రోజుల వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది. దీనికోసం దాదాపు 300 నుండి 400 లీటర్ల డీజిల్ నింపుకుంటారు. ఈ నేపథ్యంలో డీజిల్ కోసమే సుమారు రూ. 60,000 వరకు వ్యయం అవుతోంది. అలాగే ఐస్, ఆహార దినుసు లు, మంచినీరు, ఔషధాలు, వలల నిర్వహణ కలిపి ఒక వేటకు మొత్తంగా రూ.2 లక్షల వరకు ఖర్చవుతోంది. అయినా తగినంత చేపల సంపద చిక్కక పోవడంతో చేసిన ఖర్చు కూడా రాక మత్స్యకారులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.
డీజిల్ సబ్సిడీ పెండింగ్.. మత్స్యకారుల నిరసన
కూటమి ప్రభుత్వం వచ్చాక లీటరుకు రూ.9 చొప్పు న నెలకు ఇచ్చే 300 లీటర్ల డీజిల్ సబ్సిడీ (రూ.2,700) క్రమబద్ధంగా అందడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబందించి నరసాపురంలో రిజిస్టర్ వేటబోట్లు 139 ఉన్నాయి. వీరికి మూడు, నాలుగు నెలలకో సారి అరకొరగా చెల్లించడం, నిబంధనల పేరుతో ఆలస్యం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుగా సొంత డబ్బులతో డీజిల్ కొనుగోలు చేసి, బిల్లుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
ఆదాయంపై ప్రభావం : బోటుపై పనిచేసే 10 మంది కార్మికులకు నిర్ణీత జీతాలు ఉండవు. వేటలో వచ్చిన లాభాల్లోనే వారి వాటా ఆధారపడి ఉంటుంది. ఇంధన ధరల పెరుగుదల, సబ్సిడీ ఆలస్యం, చేపల వేట తగ్గడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలోని వేలాది మత్స్యకార కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటోంది. పెద్దబోట్లే కాకుండా అటు సముద్రం, ఇటు గోదావరిలో వేట సాగించే ఇంజన్ చెక్క నావలు కూడా ఒక్క నరసాపురం తీరంలోనే 200 వరకూ ఉంటాయి. వీరికీ డీజిల్ పోటు తప్పడంలేదు.
డీజిల్ రేట్లు పెరగడంతో సముద్రంలో వేట పెట్టుబడి ఖర్చులు దారుణంగా పెరిగాయి. మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు డీజిల్ సబ్సిడీని ప్రభుత్వం నెలనెలా ఇవ్వడంలేదు. బిల్లులు పెండింగ్‌లో పెట్టి ఇస్తున్నారు. దీంతో వేట సాగించడం చాలా కష్టంగా మారింది. ప్రభుత్వం డీజిల్ సబ్సిడీని లీటర్ల లెక్కన కాకుండా ప్రతి ఇంజన్ బోటుకు రూ.10 వేలు అందించాలి. అనవసర ఆంక్షలు పెట్టకూడదు.
– ఎ.చల్లారావు, మత్స్యకార నేత
వలవిల
పెరిగిన డీజిల్ ధరలు
సక్రమంగా అందని డీజిల్ సబ్సిడీ
వేట ఖర్చులు తడిసిమోపెడు
అయోమయంలో మత్స్యకారులు
ప్రభుత్వ సాయం కరువు


