రైతులకిచ్చిన హామీలు గాలికి | - | Sakshi
Sakshi News home page

రైతులకిచ్చిన హామీలు గాలికి

Jul 11 2026 6:55 AM | Updated on Jul 11 2026 6:55 AM

రైతులకిచ్చిన హామీలు గాలికి

రైతులకు అండగా 15న భీమవరానికి వైఎస్‌ జగన్‌

భీమవరం: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీలను అమలుచేయకుండా ఘోరంగా మోసం చేసిందని, రైతులు పంట పండించడానికి, పండిన పంటను విక్రయించుకోడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం భీమవరంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పార్టీ భీమవరం మండల పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల పక్షాన ప్రభుత్వానికి నిలదీయడానికి ఈనెల 15న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నందున రైతులు పెద్ద సంఖ్యలో జగన్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని, పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా కృషిచేయాలని ప్రసాదరాజు పిలుపునిచ్చారు. ప్రధానంగా ఆక్వా హబ్‌గా పేరొందిన జిల్లాలో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రొయ్యలకు మద్దతు ధరలేకపోవడం ఫీడ్‌, సీడ్‌ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులు నష్టాలబాట పట్టారన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని గత మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాలుగా ఆందోళనలు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడంతో చివరకు క్రాప్‌ హాలీడే దిశగా రైతులు ఆలోచన చేస్తున్న తరుణంలో రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని చెప్పారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుందని, పెంచిన రొయ్య మేతల ధరలను తగ్గించే వరకు ఆక్వా రైతుల పక్షాన పోరాడుతుందని ప్రసాదరాజు స్పష్టం చేశారు. జగన్‌మోహన్‌ పర్యటనను రైతులు, పార్టీ శ్రేణులు, వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయవంతం చేయాలని ముదునూరి కోరారు. సమావేశంలో పార్టీ భీమవరం నియోజవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకట రాయుడు, నియోజవర్గ పరిశీలకుడు మంతెన సోమరాజు, పార్టీ మండల అధ్యక్షుడు జల్లా కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement