గోటేరులో ముగ్గురిపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

గోటేరులో ముగ్గురిపై కేసు నమోదు

Jul 8 2026 12:56 AM | Updated on Jul 8 2026 12:56 AM

గోటేరులో ముగ్గురిపై కేసు నమోదు అక్రమ పొగాకు బేళ్ల సీజ్‌ పేకాడుతున్న ముగ్గురి అరెస్టు ముగ్గురు చిన్నారుల తండ్రి ఆచూకీ గుర్తింపు పెనుమదంలో కుక్క స్వైరవిహారం

ఇరగవరం: మండల పరిధిలోని గోటేరు గ్రామంలో ఓ మహిళపై దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నసీరుల్లా తెలిపారు. వివరాల ప్రకారం గోటేరు గ్రామానికి చెందిన యండమూరి రత్నకుమారికి అదే గ్రామంలో సుమారు 5 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థల సరిహద్దుల్లో ఉన్న దాదాపు 15 గజాల స్థలాన్ని కొవ్వూరు కృష్ణమోహన్‌ కుటుంబ సభ్యులు ఆక్రమించారు. ఈ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు, ఇరుపక్షాల స్థల పత్రాలను పరిశీలించి కొలతలు వేసుకుందామని రత్నకుమారి పలుమార్లు కోరారు. తమ స్థల పత్రాలను తెస్తామని, వారిని కూడా తీసుకురావాలని అడిగినప్పటికీ కృష్ణమోహన్‌ కుటుంబ సభ్యులు స్పందించకుండా రత్నకుమారితో తరచూ గొడవకు దిగేవారు. ఈ నేపథ్యంలో, యండమూరి రత్నకుమారి తన స్థలంలో పూలు కోసుకుంటుండగా కొవ్వూరు కృష్ణమోహన్‌, అతని భార్య, కుమారుడు అరవింద్‌ కలిసి ఆమైపె దాడికి తెగబడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం నుంచి గుంటూరుకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 32 నాణ్యమైన పొగాకు బేళ్లను పొగాకు బోర్డు నిఘా (విజిలెన్స్‌) అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో కలపర్రు టోల్‌ ప్లాజా వద్ద నిఘా ఉంచిన అధికారులు, అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు ఆటోలను తనిఖీ చేసి ఈ పొగాకును స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేసి, సీజ్‌ చేసిన పొగాకును జంగారెడ్డిగూడెం వేలం కేంద్రానికి తరలించారు. ఈ దాడుల్లో నిఘా అధికారులు కిరణ్‌, జీఎం సాయి ప్రశాంత్‌, ధర్మతేజ పాల్గొన్నారు.

ఇరగవరం: పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై నసిరుల్లా తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో మంగళవారం పేకాట శిబిరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారు వద్ద నుంచి రూ.2430 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.

ఏలూరు టౌన్‌: తల్లి మరణించి, తండ్రి వదిలేయడంతో దయనీయ స్థితిలో ఉన్న ముగ్గురు చిన్నారులకు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌ చొరవతో తండ్రి నీడ దక్కింది. కుక్కునూరు మండలం కివ్వక గ్రామానికి చెందిన షేక్‌ మహాలక్ష్మి (7), లావణ్య (5), అమూల్య (3) అనే చిన్నారుల తల్లి రెండేళ్ల క్రితం మరణించగా, తండ్రి షేక్‌ వెంకన్న తొమ్మిది నెలల క్రితం పిల్లలను వదిలి వెళ్లిపోయాడు. ఇటీవల ఏలూరు బాలసదనంలో ఈ పిల్లలను కలిసిన ఎస్పీ, వారి దీనస్థితిపై చలించి తండ్రి ఆచూకీ కనుగొనాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన మహిళా పీఎస్‌ సీఐ ఎం.సుబ్బారావు, కుక్కునూరు పోలీసులు, శక్తి టీమ్‌ మహారాష్ట్రలో ఉన్న తండ్రి వెంకన్నను గుర్తించి ఏలూరుకు రప్పించారు. ఎస్పీ శివకిషోర్‌ సమక్షంలో ఆయనకు కౌన్సిలింగ్‌ ఇచ్చి పిల్లల బాధ్యతను అప్పగించారు. పిల్లల సంక్షేమం, భద్రతకు పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు.

పాలకొల్లు సెంట్రల్‌: మండలంలోని పెనుమదం గ్రామంలో మంగళవారం సాయంత్రం ఓ కుక్క స్వైర విహారం చేయడంతో సుమారు పది మందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కుక్క దాడిలో తీవ్ర గాయాలైన నాగలక్ష్మీ, బాలుడు విన్నులు పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగలక్ష్మిని బుగ్గపై, చెవులపై తీవ్రంగా కరవగా బాలుడి చేతిపై దారుణంగా కరిచింది. కుక్కలను అదుపు చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని, పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి కుక్కల సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

నకిలీ బిల్లులు తయారు చేసిన వ్యక్తిపై కేసు

తణుకు అర్బన్‌: నకిలీ బిల్లులు తయారు చేసి సంస్థ యజమానిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదుచేసినట్లు తణుకు రూరల్‌ ఎస్సై నాళం శ్రీనివాస్‌ తెలిపారు. తణుకు మండలంలోని శ్రీనివాస ఇండస్ట్రీస్‌లో సారిక వెంకటేశ్వరరావు గుమస్తాగా పనిచేస్తూ కంప్యూటర్‌లో ట్యాలీ సాఫ్ట్‌వేర్‌ ద్వారా బిల్లులు తయారుచేయడం, అకౌంట్స్‌ నిర్వహించడం విధుల్లో భాగంగా బయట వ్యక్తుల పేర్లపై నకిలీ బిల్లులు తయారుచేసి వాటిని ఇచ్చినట్లుగా చూపిస్తూ సదరు నగదును తన భార్య బ్యాంక్‌ అకౌంట్‌కు ఫోన్‌పే ద్వారా జమ చేయించాడు. దీంతో ఇండస్ట్రీస్‌ యజమాని సింహాద్రి వెంకటరత్నం పోలీసులను ఆశ్రయించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement