ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ సౌజన్యంతో హేలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక వైఎంహెచ్‌ఏ హాల్‌లోని కానాల గురుమూర్తి కళావేదికపై నిర్వహిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు 18వ స్మారక జాతీయస్థాయి నాటిక పోటీలు నాలుగో రోజైన మంగళవారం ఆహ్లాదభరిత వాతావరణంలో ముగిశాయి. ముందుగా యడ్లపాడు మానవత సాగరి సంస్థ ఆధ్వర్యంలో జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో ప్రదర్శించిన ‘అందరూ మంచివారే.. కానీ’ అనే నాటిక కుటుంబ బంధాలను, మానవ సంబంధాలను కాపాడుకోవాలనే సందేశాన్ని ఇస్తూ సాగింది. అనంతరం జరుగుల రామారావు దర్శకత్వంలోనే ‘బావా ఎప్పుడు వచ్చితీవు’ అనే మరో నాటికను ప్రదర్శించారు. సంకుచిత భావాలున్న భర్తకు తగిన రీతిలో బుద్ధి చెప్పే భార్య కథను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఘనంగా బహుమతుల ప్రదానం
నాటిక ప్రదర్శనల అనంతరం రాత్రి బహుమతి ప్రదానోత్సవ సభ అత్యంత వైభవంగా నిర్వహించారు. హేలాపురి కళా పరిషత్ అధ్యక్షులు పెదపాటి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్‌ల సమాఖ్య అధ్యక్షుడు బుద్దాల వెంకట రామారావు, ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్ వేదిక అధ్యక్షుడు ముత్తవరపు సురేష్ బాబు, బొప్పన నరసింహారావు, కళారత్న ఎస్.వి. రామారావు, గరికపాటి కాళిదాసు, మజ్జి సూర్యకాంతారావు, కే.బి. రావు తదితరులు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తా కౌసలేంద్రరావు, పి. విజయ్ కుమార్, వల్లముల రామాంజనేయులు, మండవ రాజగోపాలకృష్ణ తదితరలు పాల్గొన్నారు.


