భీమవరం: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ములను తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రసన్నకుమార్ మాట్లా డుతూ రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని వాటిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ వంటి కోర్సులను అభ్యసించేందుకు ఆసక్తి ఉన్నా విద్యాసంస్థలకు ఫీజులు కట్టలేని పరిస్థితిలో చదువులకు వెనుకంజ వేస్తున్నారన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయినా ఇంతవరకు బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని ఇచ్చిన హామీలని నెరవేర్చలేదన్నారు. హాస్టల్స్ విద్యార్థులకు రూ.3 వేలు మెస్ చార్జీలు పెంచాలని, అద్దెభవనాల్లోని హాస్టల్స్‌కు సొంతభవ నాలు నిర్మించాలని ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. ర్యాలీగా వెళ్లి డీఆర్వోకు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రసాద్, సహాయ కార్యదర్శి బి.సింధు, పి.నాగేంద్రబాబు, కె.రోహిత్, ఎన్.సాయిఫణికుమార్ పాల్గొన్నారు.


