యలమంచిలి: చించినాడ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆచంట మండలం భీమలాపురం గ్రామానికి చెందిన చప్పిడి హేమ చంద్రిక (19) తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమెను భీమవరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. చంద్రిక తన మేనమామ కట్టా శ్రీనివాస్‌తో కలిసి తాటిపాకకు అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా చించినాడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బొలెరో ట్రక్ డ్రైవర్ ముగ్గు గణేష్ మద్యం సేవించి ఆ మత్తులో వాహనాన్ని రాంగ్ రూట్ లో అతివేగంగా నడపడం వలనే ప్రమాదం జరిగిందని నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బంధువులు మృతదేహంతో పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. దీనిపై ఎస్సై రాజ్‌కుమార్ స్పందిస్తూ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చట్ట విరుద్ధమని హెచ్చరించడంతో మృతదేహాన్ని అంబులెన్స్‌పై పోలీస్‌స్టేషన్ నుంచి దూరంగా తరలించారు. అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులు సుమారు మూడు గంటలపాటు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. దీంతో ఎస్సై రాజ్‌కుమార్ ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి ఇప్పటికే కేసు నమోదు చేశామని, నిందితుడిని విచారిస్తున్నామన్నారు. చంద్రిక న్యాయం జరుగుతుందని చెప్పడంతో ఆందోళన విరమించారు.


