63.29 శాతం పూర్తయిందంట!
సాక్షి ప్రతినిధి,ఏలూరు : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఎన్యుమరేషన్ ఫారాల పరేషాన్ జిల్లాలో అక్కడక్కడా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఫారాలు అందకపోవడం, మరికొన్ని చోట్ల రాజకీయ కారణాలతో అందించకుండా నిలుపుదల చేస్తే ఫిర్యాదులతో వెంటనే ఇవ్వడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు ఫారాల పంపిణీ, డిజటలైజేషన్ వేగవంతం చేయాలని సమీక్షా సమావేశాల్లో అధికారులు ప్రత్యేక ఆదేశాలిచ్చారు.
ఫారాలు.. అడిగితేనే ఇస్తారట!
సర్ కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సీరియస్‌గా నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం, సర్‌కు సంబంధించి కొన్ని చోట్ల ప్రజలు అడిగే అనుమానాలు బీఎల్‌ఓలు నివృతి చేసే పరిస్థితి లేకపోవడంతో మరోవైపు సమస్యలు కొనసాగుతుండగా ఇంకోవైపు మాత్రం పూర్తిస్థాయిలో ఫారాల పంపిణీ జరగలేదు. ఏలూరు నగరంలో శాంతినగర్‌లోని కొన్ని వీధులు, అలాగే ఇతర ప్రాంతాల్లో పంపిణీ ప్రక్రియ పూర్తి కాలేదు. శనివారానికి శ్రీరామవరం పోలింగ్‌బూత్ నంబర్ 80 పరిధిలో ఫారాల పంపిణీ ప్రక్రియ జరగలేదు. దీనిపై తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన తర్వాత పంపిణీ చేశారు. అలాగే ఏలూరు రూరల్ మండలంలోని గుడివాకలంకలో 800 మందికి ఫారాల పంపిణీ పూర్తి కాలేదు. విషయాన్ని స్థానికులు తహసీల్దార్ దృష్టికి తీసుకువస్తే ఫారాల పంపిణీ ప్రక్రియ గంటలో పూర్తిచేశారు. ఇలా కొన్నిచోట్ల జరుగుతూనే ఉంది. శనివారం పోలవరం నియోజకవర్గంలో గంట సేపు సర్వర్ నిలిచిపోవడంతో డిజిటలైజేషన్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. క్షేత్రస్థాయిలో ఫారాల పంపిణీ జరిగిందా లేదా అనే ప్రక్రియపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి సారించకుండానే నూరు శాతం ప్రక్రియ పూర్తయిందని నివే దికలు ఇవ్వడంతో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీపై దృష్టి మరలింది. ప్రస్తుతం జిల్లా యంత్రాంగమంతా డిజటలైజేషన్‌పైనే హడావుడి చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి జిల్లాలో 75 శాతం డిజటలైజేషన్ పూర్తి కావాలని కలెక్టర్ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు.
జిల్లాలో ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కై కలూరులో 62.02 శాతం, నూజివీడులో 63.99, పోలవరం 66.77, ఉంగుటూరులో 66.86, ఏ లూరులో 69.47 శాతం, దెందులూరు నియోజకవర్గంలో 56.37 శాతం, చింతలపూడిలో 58.07 శాతం, మొత్తంగా జిల్లాలో 63.29 శా తం డిజటలైజేషన్ చేసినట్టు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. జిల్లాలో పోలవరం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలు వంద శాతం పంపిణీ పూర్తయిందని, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో 99 శాతం, ఏలూరు నగరంలో 98.27 శాతం పూర్తయిందని అధికారులు తెలిపారు.
అన్నీ సమస్యలే ‘సర్’
ఏజెన్సీ ఏరియాలో తరచూ సర్వర్ సమస్యలు
కొన్ని గ్రామాల్లో ఫిర్యాదు చేస్తేనే ఫారాలు అందజేత
నేటి సాయంత్రానికి 70 శాతం డిజిటలైజేషన్‌కు కలెక్టర్ ఆదేశం
పూర్తిగా ఇళ్లకు చేరని ఎన్యుమరేషన్ పత్రాలు
అన్ని పనులు సచివాలయ సిబ్బందితోనే


