సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం జనసేనలో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరాయి. అవినీతి ఎమ్మెల్యేగా, తీవ్ర వివాదాస్పద నేతగా ఖ్యాతిగాంచిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజును నియోజకవర్గ కేడర్ మొదలుకొని పార్టీ అధిష్టానం వరకు ఎవరు సీరియస్‌గా పట్టించుకోని పరిస్థితి. బలప్రదర్శన చాటేలా వంద కార్లతో ఏలూరు పార్టీ సమావేశానికి హాజరై పోలవరంలో దొరల పాలనకు ముగింపు పలుకుతానని... రెండేళ్ళుగా పార్టీలో తనను ఇబ్బందిపెడుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. పోలవరం నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజు గెలుపొందిన నాటి నుంచి వివాదాస్పద, దూకుడు వైఖరితో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. స్వయంగా పోలవరం జనసేన నేత కరాటం రాంబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమ ఫోన్ల సంభాషణ ఆడియో వైరల్‌గా మారడంతో ఎమ్మెల్యే అవినీతి తెరపైకి వచ్చింది. నియోజకవర్గ స్థాయి అధికారుల వరకు అందరి వద్ద డబ్బులు వసూలు చేసి అట్టహాసంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం, పార్టీలో ప్రశ్నించిన వారిపై తన సొంత టీమ్‌తో దాడులు చేయించడంతో అప్రతిష్టపాలయ్యారు. బాలరాజు అవినీతి అంటూ నామినేటెడ్ పదవులకు ఎంత తీసుకుంది.. ఏఏ పనులకు ఎంత వసూలు చేసింది.. బాధితుల ఫోన్ నెంబర్లతో సహా లేఖలో పేర్కొని పార్టీకి ఫిర్యాదు చేయడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఎమ్మెల్యే తీరుపై అతని భార్య జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిసి ఫిర్యాదు చేసి న్యాయం చేయమని కోరింది. గత నెలలో పవన్ పిలిపించి ఎమ్మెల్యేకు క్లాస్ పీకారు. నాలుగు వారాల్లోగా నియోజకవర్గంతో పాటు, కుటుంబ పరిస్థితులను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు.
కరాటం వర్సెస్ ఎమ్మెల్యే
పార్టీ సీనియర్ నేత కరాటం రాంబాబు సోదరుడి కుమారుడు కరాటం సాయిబాబు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ హవా సాగిస్తున్నారు. కొంతకాలం నుంచి ఎమ్మెల్యేకు, సాయిబాబుకు దూరం పెరిగింది. ఎమ్మెల్యేకు రాజకీయ గురువుగా ఉన్న జీ.రవికుమార్ కూడా కొద్ది రోజుల నుంచి ఎమ్మెల్యేకు దూరంగా ఉండటం మరింత చర్చగా మారింది. రెండ్రోజుల రోజుల క్రితం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పార్టీ నియామకాల గురించి ఏర్పాటు చేసిన సమావేశానికి బలరాజుకు ఆహ్వానం అందలేదు. సాయిబాబుతో బలరామకృష్ణ సమావేశమై పార్టీ నియామకాలపై చర్చించారు. దీంతో బాలరాజుకు చిర్రెత్తుకొచ్చి శుక్రవారం ఏలూరులో జరిగిన పార్టీ సమావేశానికి బలప్రదర్శనగా హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం వైజంక్షన్‌లో అన్ని మండలాల్లో కేడర్‌ను సమీకరించి కార్ల ర్యాలీ నిర్వహించి జంగారెడ్డిగూడెంలోనే మాట్లాడారు. ఏలూరు పార్టీ సమావేశానికి చేరుకుని నిర్మాణ సారథుల ఎంపిక కమిటీకి తన వర్గానికి చెందిన దరఖాస్తులను అందచేసి పోలవరంలో దొరల పాలనకు ఈ రోజు నుంచి తెరపడిందని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిర్రి బాలరాజు పెట్టే నేతలనే గెలిపించుకుంటానని సవాల్ చేశారు. కరాటం సాయిబాబు మాట వినేవారికే సమాచారమిచ్చి వారికే పదవులు ఇవ్వాలని ప్రయత్నించారని, పార్టీ శ్రేణులు తన దగ్గరకు వచ్చి బాధపడితే 400 మందితో కలిసి ఏలూరు వచ్చి దరఖాస్తులు ఇచ్చానని, పెత్తందారీ వ్యవస్థను పారదోలాలని, దొరల పాలనకు చరమగీతం పాడతానని హెచ్చరించారు.
పోలవరం జనసేనలో తారాస్థాయికి వర్గ విభేదాలు
పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేకు దక్కని ప్రాధాన్యం
వంద కార్లతో బలప్రదర్శనగా ఏలూరుకు చిర్రి బాలరాజు
పోలవరంలో దొరల పాలనకు ముగింపు పలుకుతానని ప్రకటన


