టి.నరసాపురం: మక్కినవారిగూడెం సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, దుర్వినియోగమైన నగదును రికవరీ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రైతులు ఆందోళన నిర్వహించారు. సొసైటీలో పనిచేస్తున్న ఇద్దరు గుమస్తాలు ఎరువుల విక్రయాల్లో సుమారు రూ.1.44 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నూజివీడు డీఆర్‌ఓ రవికుమార్ విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న గుమస్తా సిరిమళ్ళ సాయితేజ మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేయగా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ అవినీతిలో సాయితేజ ప్రమేయం లేదని, ఆయనపై అన్యాయంగా ఆరోపణలు చేస్తూ నగదు కట్టించాలని చూడటం వల్లే ఆత్మహత్యకు యత్నించాడని అతని కుటుంబ సభ్యులు సొసైటీ వద్ద ధర్నాకు దిగారు. సొసైటీ చైర్‌పర్సన్ సూర్యనారాయణ వివరణ ఇస్తూ.. ఉన్నతాధికారుల పూర్తి విచారణ అనంతరం నిజానిజాలు వెల్లడవుతాయని తెలిపారు.
భీమవరం (ప్రకాశంచౌక్): కలెక్టరేట్‌లో జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో శుక్రవారం జిల్లా స్థాయి కౌన్సిల్ సమావేశం కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై నిశితంగా పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను వివిధ జిల్లాలు, జోన్లు, మల్టీ–జోన్ కేడర్లలో సర్దుబాటు చేసే అంశంపై ఉద్యోగ సంఘాల నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. జిల్లాల విభజన, కేటాయింపుల వల్ల ఏ ఒక్క ఉద్యోగి నష్టపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లా డుతూ ఉపాధ్యాయుల బదిలీలు, సీనియారిటీ విషయంలో తమకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా విభజన జరిగేలా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను వినతిపత్రం రూపంలో కలెక్టర్‌కు అందజేశారు. యూటీఎఫ్, ఏపీడబ్ల్యూజేయు, ఇతర గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ పి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: సహచర అధికారిణి వేధింపులు తాళలేక ఓ ఆశా కార్యకర్త గుండెపోటుకు గురైంది. బాధితురాలి వివరాల ప్రకారం.. పట్టణంలోని హరిజనపేట అర్బన్ పీహెచ్‌సీ పరిధిలో బిట్రాల రమాదేవి ఆశా కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నారు. అదే కేంద్రంలో పనిచేస్తున్న ఏఎన్‌ఎం పద్మ గత కొంతకాలంగా తనను తీవ్రంగా అవమానిస్తూ, వేధింపులకు గురిచేస్తోందని రమాదేవి ఆరోపించారు. ఈ వేధింపులపై రమాదేవి మెడికల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయగా, విధులకు హాజరైన తర్వాత సమస్యను సర్దుబాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. దీంతో తన భర్త ఆదినారాయణతో కలిసి ఇంటికి పయనమయ్యారు. అయితే, తీవ్ర మనస్తాపానికి గురైన రమాదేవికి మార్గమధ్యంలోనే ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ఆమె భర్త స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుండి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జంగారెడ్డిగూడెం: వర్షాకాలంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా సురక్షితమైన మంచినీరు అందించాలని, ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి జీవీకే మల్లికార్జునరావు అధికారులను ఆదేశించారు. జంగారెడ్డిగూడెం డీఎల్‌డీవో కార్యాలయం వద్ద శుక్రవారం పది మండలాల పంచాయతీ అభివృద్ధి అధికారులు, విస్తరణ అధికారులు, ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశం, పంచాయతీ రికార్డుల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.


