భీమవరం : రాష్ట్రస్థాయి పోటీలకు చెస్ పోటీల కోసం క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం గురువారం పట్టణంలో నిర్వహింరు. స్థానిక అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లా అండర్–19 ఓపెన్ ర్యాపిడ్ చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నాళం వరుణ్‌శ్రీతేజ(కాళ్ల), ఇ.వివేక్(తణుకు), అన్నెపు శాశాంక్(తాడేపల్లిగూడెం), పి.శ్రీశయసాకేత్(పాలకొల్లు), కంతేటి జీషిత్‌వర్మ(భీమవరం) ఎంపికయ్యారని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాదాసు కిషోర్ చెప్పారు. విజేతలు ఈనెల 22 నిర్వహించే రాష్ట్రస్ధాయి అండర్–19 ఓపెన్ ర్యాపిడ్ చెస్ పోటీల్లో పాల్గొంటారని కిషోర్ తెలిపారు.
నరసాపురం రూరల్ : మొగల్తూరు మండలం కేపీపాలెం సౌత్ పంచాయతీ పరిధిలోని కొండేటి వారి మెరకలో కొండేటి చినబాబుకు చెందిన మేకల మందపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది. దీంతో 23 మేకలు మృత్యువాత పడ్డాయని, సుమారు రూ.3 లక్షలు నష్టం వాటిల్లిందని వాపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని చినబాబు కోరారు.
జంగారెడ్డిగూడెం : బాలిక అదృశ్యంపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. వివరాల ప్రకారం వేలేరుపాడు మండలానికి చెందిన 17 ఏళ్ల బాలిక జంగారెడ్డిగూడెం మండలంలో అమ్మమ్మ వద్ద ఉంటూ ఇంటర్ చదువుతోంది. ఈ నెల 10న పరీక్ష రాసేందుకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. బాలిక అమ్మమ్మ సాయంత్రం వరకు చూసి, బాలిక తల్లికి విషయాన్ని తెలియజేసింది. దీంతో బాలిక తల్లి పరిసర ప్రాంతాలు వెతికినా బాలిక ఆచూకీ లభించలేదు. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది.
పెనుగొండ: పెనుగొండ జయా నర్సింగ్ హోం పక్కన పిల్ల కాలువ గట్టున తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగినట్లు సత్తి నాగదేవి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై కె.గంగాధర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 16న నాగదేవి తాడేపల్లిగూడెంలోని పుట్టింటికి వెళ్లారు. 18న మధ్యాహ్న సమయంలో పక్కింటి వారు ఇంటి తలుపులు తెరిచి ఉన్నట్లు నాగదేవి సమాచారం అందించారు. దీంతో ఆమె వచ్చి చూడగా బీరువాలో ఉన్న సుమారు 9 కాసుల బంగారం, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.
పెంటపాడు : వాతావరణ మార్పులకు అనుగుణంగా వరి కోతలను సరళం చేసేందుకు నూతన టెక్నాలజీతో సరసమైన ధరల్లో కోత మెషీన్లు అందిస్తున్నట్టు అద్విత ఆగ్రోస్ కంపెనీ ప్రతినిధి ఎన్.సాయి తెలిపారు. గురువారం ఉగాదిని పురస్కరించుకుని ప్రత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని వరికోత మెషీన్ల కంపెనీని ఆయన ప్రారంభించారు. నాణ్యమైన మెషీన్లు అందిస్తామని, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొలిరోజు 20 మెషీన్లను పలు ప్రాంతాలకు చెందిన రైతులకు విక్రయించారు. మెషీన్లు కొనేవారికి బ్యాంకులు రుణాలు ఇస్తాయన్నారు. మెషీన్ల వినియోగంపై తాము అవగాహన కల్పిస్తామన్నారు. స్పేర్ పార్టులు కూడా తమ వద్ద లభ్యమవుతాయన్నారు. చైనా దేశ ప్రతినిధులతో పాటు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ, తనుబుద్ది భోగేశ్వరరావు, రైసుమిల్లర్ కొలనువాడ పెదకృష్ణంరాజు, టీడీపీ నేత వలవల బాబ్జి పాల్గొన్నారు.


