పంటల పాలిట శత్రువు.. వయ్యారిభామ | - | Sakshi
Sakshi News home page

పంటల పాలిట శత్రువు.. వయ్యారిభామ

Mar 20 2026 7:49 AM | Updated on Mar 20 2026 7:49 AM

పాడి–పంట

యలమంచిలి: రైతులు తెగుళ్ల కంటే అధికంగా భయపడేది వయ్యారిభామ (పార్థీనియం) కలుపు మొక్కకే. ఎక్కడైనా పెరగడం ఈ మొక్క లక్షణం. ఈ కలుపు మొక్క ప్రధాన పంటకు నష్టం కలిగిస్తుంది. మొలచిన నెల రోజుల్లోనే పూతకు వస్తుంది. ఒక్కో మొక్క 50 వేల విత్తనాలను ఉత్పత్తి చేయడంతో పాటు గాలి పాటుకు దూర ప్రాంతాలకు సైతం తేలికగా విస్తరిస్తుంది. ఈ కలుపు మొక్క గురించి మండల వ్యవసాయాధికారి దుంగా బాల త్రిపుర సుందరి తెలిపిన వివరాలు..

జీవరాశికి ప్రమాదమే..

వయ్యారిభామ వల్ల పంటలకే కాదు మనుషులు, పశువులకూ ముప్పే. మనుషులకు జ్వరం, ఉబ్బసం వంటి వ్యాధులతో పాటు చర్మ సంబంధిత అలర్జీ వస్తుంది. జలుబు, కళ్లు ఎరబ్రడడం, కనురెప్పల వాపు తదితర సమస్యలు వస్తాయి. ఈ మొక్కలను తింటే పశువులు అయితే హైపర్‌ టెన్షన్‌కు గురవుతాయి. ఇక పంటలకు నీరు, పోషకాలు అందకుండా వాటి కన్నా ముందుగా ఇవే శోషించుకుంటాయి. తద్వారా దిగుబడులు 40 శాతం వరకు తగ్గుతాయి. వంగ, మిరప, టమాట, మొక్కజొన్న పైర్లు పూత దశలో ఉన్నప్పుడు వాటిపై వయ్యారి భామ పుప్పొడి పడితే ఉత్పత్తి తగ్గుతుంది. పైర్లకు మొవ్వ, కాండం కుళ్లు తెగుళ్లు సోకే ప్రమాదముంది. ఈ మొక్కలు పశుగ్రాస పంటలకు కూడా నష్టం కలిగిస్తాయి. ఈ మొక్క ల్ని నిర్మూలించాలంటే రైతులు తప్పనిసరిగా సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

తొలగించడం ఇలా

వయ్యారిభామ మొక్కలు తక్కువ సంఖ్యలో ఉంటే చేతితో పీకేయాలి. మొక్కలు పూతదశకు రాక ముందే పీకి తగలబెట్టాలి. లేకపోతే వాటి వ్యాప్తిని నివారించడం కష్టం. ఒకవేళ పూత దశకు చేరుకున్న తర్వాత మొక్కలను పీకినట్లయితే వాటిని వెంటనే కుప్పగా వేసి తగలబెట్టాలి. అలాగే మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల పంటల్లో విత్తనాలు మొలక రాకముందు లీటరు నీటికి 4 గ్రాముల చొప్పున అట్రాజిన్‌ కలిపి పిచికారీ చేస్తే వయ్యారిభామ మొక్కల బెడద ఉండదు. విత్తనాలు మొలకెత్తిన 15–20 రోజులకు లీటరు నీటికి 2 ఎంఎల్‌ పేరాక్వాట్‌ మందును కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పశుగ్రాసం వేసేవారు పైరు వేయకముందే లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున అట్రాజిన్‌ కలిపి పిచికారీ చేయాలి.

దుంగా బాల త్రిపుర సుందరి, యలమంచిలి మండల వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement