పసిప్రాణం వెలవిల | - | Sakshi
Sakshi News home page

పసిప్రాణం వెలవిల

Mar 16 2026 7:16 AM | Updated on Mar 16 2026 7:16 AM

విక్రయాల వ్యవహారంలో 9 మందిపై కేసు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పసిపిల్లల విక్రయాల ఘటనలతో కై కలూరు నియోజకవర్గ పరువుపోతోంది. ముదినేపల్లి మండల కేంద్రంగా సాగుతున్న దందా గుట్టురట్టవడంతో జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈడేపల్లికి చెందిన ఓ మహిళ విక్రయాల్లో కీలకంగా వ్యహరించడంతో ఆమెను మొదటి ముద్దాయిగా చేర్చారు. లోతైన విచారణ కొనసాగుతోంది. ముదినేపల్లి మండలం శ్రీహరిపురంలో దాదాపు రెండు నెలల క్రితం ఆకేటి మోక్షిత్‌ అనే రెండున్నరేళ్ల బాబు మిస్సింగ్‌ కేసుగా నమోదయ్యింది. ప్రస్తుతం పిల్లల విక్రయాల ఘటన వెలుగులోకి రావడంతో మోక్షిత్‌ అంశం తెరపైకి వచ్చింది.

ఐదుగురు పిల్లలు

నియోజకవర్గంలో మొత్తం ఐదుగురు పిల్లల విక్రయాలు జరిగినట్టు గుర్తించారు. వీరిలో ముగ్గురు పిల్లల బంధువుల నుంచి దత్తత తీసుకున్నారు. ము దినేపల్లి మండలం అన్నవరం, మండవల్లి మండ లం కానుకొల్లులో ఇద్దరు పిల్లల తల్లిదండ్రుల వివరాలు తెలియాల్సి ఉంది. సంతానలేమితో బాధపడుతున్న మహిళలను గుర్తించి ఆడపిల్లకు రూ.4 లక్షలు, మగపిల్లాడికి రూ.5 లక్షలకు విక్రయిస్తున్నారని సమాచారం. దీంతో ఏలూరు బాలల సంరక్షణ యూనిట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సీహెచ్‌ సూర్యచక్రవేణి విచారణ చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణిగా రిజిస్టర్‌ కా కుండా పిల్లలను తీసుకొచ్చిన త ల్లుల వివరాలు సేకరించారు.

డొంక కదిలింది ఇలా..

ముదినేపల్లి మండలం అన్నవరానికి చెందిన దూలం రాంప్రసాద్‌, సునీత దంపతులకు పిల్లలు లేరు. దీంతో దగ్గర బంధువు గోపి ద్వారా ఈ డేపల్లికి చెందిన అబ్బిశెట్టి వీరాకుమారి (వీరమ్మ), రెడ్డమ్మ, ఫరీనా వీరిని కలసి 8 నెలల వయసున్న యషనాశ్రీ అనే పాపను అందించారు. ఇందుకు గాను సునీత దంపతులు వీరమ్మ ద్వారా రూ.3 లక్షలు చెల్లించారు. పాపకు బొమ్మినంపాడు సచివాలయంలో 2024 డిసెంబరు 1న జన్మించినట్టు బర్త్‌ సర్టిఫికెట్‌ పొందారు. అలాగే వీరమ్మ ఏలూరు జనని హాస్పటల్‌లో 2024 సెప్టెంబరు 29న నర్సు మాధురి ద్వారా మగపిల్లాడిని తీసుకుంది. ఇందుకు గాను రూ.30 వేలు చెల్లించారు. ఆ సమయంలో వీరమ్మతో పాటు గోపి, పరసా రాము ఉన్నారు. బాబుకు పరసాత యశ్వంత్‌ శివరాము అనే పేరు కూడా పెట్టారు. రెండు విక్రయాల్లో కీలకంగా వ్యవహరించిన వీరమ్మ ముదినేపల్లి మండలంలో ఓ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుడి తల్లి కావడం చర్చనీయాంశమైంది.

పిల్లల భవిష్యత్తుకు భరోసా ఎవరూ?

పిల్లల మార్పిడితో సంతానం లేని దంపతులకు పెద్ద ఊరట కలగవచ్చు. సమాజంలో ఛీత్కారాలకు ఫుల్‌స్టాప్‌ పడవచ్చు. కానీ పసిపిల్లలుగా తీసుకొచ్చి పెంచుకుంటున్నా పిల్లలకు ఇప్పుడు ఆలోచన జ్ఞానం వచ్చింది. వీరు మీ అసలు తల్లిదండ్రులు కాదని బయట వ్యక్తుల ద్వారా తెలిస్తే వారి భవిష్యత్తు ఏంటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి లేత మనసు పొరల్లో పెంచిన ప్రేమ, కన్న ప్రేమ అనే ఆలోచనలు రేకెత్తుతాయి. పిల్లలను విక్రయించుకున్నారనే అపవాదు సైతం సమాజంలో జీవిస్తున్న వారి తల్లిదండ్రులపై పడుతోంది. చట్టప్రకారం దత్తత ద్వారా పిల్లలను పెంచుకోవడం ఉత్తమ మార్గమని నిపుణులు చెబుతున్నారు.

ఇదేం ‘పాప’ం

ముదినేపల్లి కేంద్రంగా పసిబిడ్డల విక్రయాలు

9 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు

అంగన్‌వాడీ కేంద్రాల వారీగా పిల్లల ఆరా

రెండు నెలలుగా ఆచూకీ తెలియని మోక్షిత్‌

పిల్లల విక్రయాల ఘటనలో ఏ–1గా అబ్బిశెట్టి వీరమ్మ, అలాగే గోపి, రెడ్డమ్మ, ఫరీనా, పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు, ఏలూరు జనని హాస్పటల్‌ నర్సు మాధురి వంటి 9 మందిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 81, 87 జేజే యాక్టు ప్రకారం కేసును ముదినేపల్లి ఎస్సై వీరభద్రరావు నమోదు చేశారు. ఈ కేసులో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ హిందూ దత్తత యాక్డు, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యాక్డు ప్రకారం పిల్లలను దత్తత తీసుకున్నప్పుడు కచ్చితమైన నిబంధనలు పాటించాలన్నారు. కేసు నమోదు చేసి అనుమానితులను విచారిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement