తణుకు అర్బన్: తణుకు కూటమిలో టీడీపీ, బీజేపీల మధ్య వైరం రైల్వేస్టేషన్‌లో వేదికగా బహిర్గతమైంది. ప్రధాని ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలను తొలగించడంపై బీజేపీ సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సాక్షిగా ఫ్లెక్సీల రగడ దుమారం రేపుతోంది. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం అమృత్ భారత్ రైలు ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రితోపాటు బీ జేపీ నాయకులు, ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు స్టేషన్‌కు వచ్చారు. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక తరఫున బీజేపీ నాయకులు స్టేషన్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఫొటోలు లేవని కూటమి నేతలు తొలగించిన తీరు చర్చనీయాంశంగా మా రింది. కూటమి నేతల ఫొటోలు లేవంటూ ప్రధాని మోదీతోపాటు జాతీయ నాయకుల ఫొటోలు ఉన్నా ఆ ఫ్లెక్సీలను తొలగించిన విధానం బీజేపీ వర్గాల్లో తీవ్ర అవమాన భారాన్ని రేకెత్తించింది. టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఫ్లెక్సీలను చింపేసి కిందపారేశారంటూ ధ్వజమెత్తారు.
తణుకులో ఫ్లెక్సీల రచ్చ
తణుకులో వైఎస్సార్ విగ్రహం వద్ద, అత్తిలి మండలం ఉరదాళ్లపాలెంలో ఏర్పాటుచేసిన కూటమి ఫ్లెక్సీల వివాదం సద్దుమణగక ముందే తాజాగా బీజేపీ ఫ్లెక్సీ వివాదం నెలకొంది. ఒక మహిళ అని, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అని, ముళ్లపూడి వంశీకురాలని కూడా చూడకుండా ఆమె ఉన్న ఫ్లెక్సీలు చించిపారేశారంటూ టీడీపీలో ఉన్న ముళ్లపూడి అభిమానులు, బీజేపీ పార్టీ నాయకులు సైతం గుర్రుగానే ఉన్నారు.రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న ఆమె ఫొటోని ఏ ప్రభుత్వ కార్యక్రమంలో కానీ, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఫ్లెక్సీల్లో కానీ కూటమి నాయకులు వేశారేమో ఇప్పుడు ఉన్న ఫ్లెక్సీలను చూడాలనే కౌంటర్‌లు కూడా ఇస్తున్నారు. ఈ సమస్యపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుకను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా విజయవాడలో సమావేశంలో ఉన్నట్టు అనుచరవర్గం తెలిపారు.
కేంద్ర మంత్రి సాక్షిగా కుమ్ములాటలు


